డబ్బుల్లేకుండా దర్శనానికి వస్తారా?

2 Oct, 2016 08:26 IST|Sakshi
డబ్బుల్లేకుండా దర్శనానికి వస్తారా?

భక్తునిపై సిబ్బంది దుర్భాషలు
 
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాదిపై తొలిరోజే భక్తునికి చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం పటమటకు చెందిన చలమయ్య చౌదరి అనే భక్తుడు హైదరాబాద్‌లోని సుమారు 10 మంది  బంధువులతో దర్శనానికి వచ్చారు. క్యూలో వెళ్లి రూ.100 టిక్కెట్లు అడగ్గా లేవు, రూ.300, 500 లవే ఉన్నాయని సిబ్బంది చెప్పారు. వాటిని అసలు ముద్రించలేదని తెలిపారు.

అలాంటప్పుడు రూ.100 టిక్కెట్లు అని బోర్డులు ఎందుకు పెట్టారని చలమయ్య చౌదరి ప్రశ్నించారు. రూ. మూడు వేలు పెట్టి టిక్కెట్లు కొనలేనివాడివి, అమ్మవారి దర్శనానికి తొలిరోజే ఎందుకు వచ్చారంటూ సిబ్బంది ఆయనను నానా దుర్భాషలాడారు. దీంతో ఆవేదనకు గురైన చౌదరి మీడియా పాయింట్ వద్ద ఉన్న అధికారులకు చెప్పారు.

ఈవో ఎ.సూర్యకుమారి అక్కడకు వచ్చి చలమయ్య చౌదరి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పి, దర్శనానికి పంపారు. సిబ్బంది తీరుపై భక్తులు విస్మయానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు