కాకి వాలిందని కారు మార్చిన సీఎం!

13 Jun, 2016 13:33 IST|Sakshi


బెంగళూరు : కర్ణాటక ముఖ్యమత్రి సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పెను దుమారం సృష్టించిన 'వాచీ' ఘటన మరవకముందే తాజాగా 'కాకి' కహానీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు అన్నాక కార్లు మార్చడం, కొత్త వాహనాలు  కొనుక్కోవడం సాధారణమే. ఇటీవలి సిద్దూ 35 లక్షల రూపాయలతో కొత్త టొయోటా ఫార్చ్యునర్‌ కారు కొన్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్‌ చేశారు. అదే ఇప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకునే 35 లక్షలు ఖర్చు పెట్టి కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

గతంలో సిద్దరామయ్య వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేతలు ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు