ఇచ్చినట్టే ఇచ్చి..

18 Oct, 2016 14:31 IST|Sakshi
డీఐఈఓ కార్యాలయానకి కేటాయించిన భవనం
వికారాబాద్‌కు డీఐఈఓ కార్యాలయం కేటాయింపు
ప్రారంభించకుండానే మహబూబ్‌నగర్‌ జిల్లాకు తరలింపు
జిల్లా ఒకచోట.. కార్యాలయం మరోచోట
ప్రభుత్వ నిర్ణయంతో జూనియర్‌ కళాశాలలకు తప్పని ఇబ్బందులు
 
కొత్త జిల్లాలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ కొలువుదీరాయి.. ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యాధికారి (డీఐఈఓ) కార్యాలయం విషయంలో మాత్రం ప్రభుత్వం గందరగోళానికి గురిచేసింది. ఏర్పాట్లన్నీ పూర్తై ప్రారంభానికి సిద్ధం కాగానే జిల్లా ఆవిర్భావ సమయానికి ఒకరోజు ముందు 
ఈ కార్యాలయాన్ని మరో జిల్లాకు తరలించి విస్మయానికి గురిచేసింది. తాత్కాలిక భవనాన్ని ఎంపిక చేసి, కార్యాలయ బ్యానర్‌ ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత  తరలించడం చర్చనీయాంశమైంది. 
 
సాక్షి, వికారాబాద్‌: పరిపాలనా సౌలభ్యంకోసం అధికార వికేంద్రీకరణ (సపరేషన్స్ ఆఫ్‌ పవర్స్‌) ప్రాథమిక సూత్రం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ శాఖలను అందుబాటులోకి తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశం. జిల్లా ఆవిర్భావం తర్వాత జిల్లాస్థాయి కార్యాలయాలు ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యాధికారి (డీఐఈఓ) కార్యాలయం మాత్రం ప్రారంభించకుండానే మహబూబ్‌నగర్‌ జిల్లాకు తరలించడం చర్చనీయాంశమైంది. ఒక జిల్లా కార్యాలయం మరో జిల్లాలో ఏర్పాటు చేయడమేమిటని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌ జిల్లా విద్యాధికారి కార్యాలయం ఏర్పాటు కోసం స్థానిక జూనియర్‌ కళాశాలలోని ఓ భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి ఎంపికచేశారు. జిల్లా ఆవిర్భావం రోజున ఆ కార్యాలయం ఏర్పాటుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యాలయ ఏర్పాటుకు నోడల్‌ అధికారిగా ప్రస్తుత రంగారెడ్డి జిల్లా ఇంటర్‌బోర్డు వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) మహమూద్‌ అలీని ప్రభుత్వం నియమించింది. ఈ భవనం ప్రారంభంకోసం ఆయన కార్యాలయ బోర్డును సైతం తయారు చేయించి సర్వం సిద్ధం చేశారు. తాత్కాలిక భవనాన్ని ముస్తాబు చేయడంతోపాటు ఇంటర్నెట్‌ కనెక్షన్ తీసుకున్నారు. అన్ని వసతులు సమకూర్చారు. తీరా జిల్లా ఆవిర్భావ సమయానికి ఒకరోజు ముందు జిల్లా కార్యాలయాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాధికారికి అటాచ్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
మూడు రోజుల ముచ్చటే..
డీఐఈఓ కార్యాలయం వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం మూడురోజుల ముచ్చటగానే మారింది. ఏం జరిగిందో తెలియదు గాని జిల్లా ఆవిర్భావం రోజున పలు జిల్లాస్థాయి కార్యాలయాలను ప్రారంభించినా ఈ కార్యాలయాన్ని మాత్రం ప్రారంభించలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారికే ఈ జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి బాధ్యతలు అప్పగించారు. దీంతో వికారాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న ఇంటర్‌ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. నూతనంగా ఏర్పడిన జిల్లాలో మొత్తం 89 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిలో 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా, 13 ఆదర్శ పాఠశాల జూనియర్‌ కళాశాలలు, 5 సాంఘీక సంక్షేమ, 2 గిరిజన సంక్షేమ కళాశాలలున్నాయి. వీటితో పాటు 60 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇంటర్‌ విద్యార్థుల చదువులు, కళాశాలలకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను డీఐఈఓ నిర్వహించాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలుంటే కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు జిల్లా కార్యాలయానికి వెళ్లి నివృత్తి చేసుకుంటారు. అడ్మిషన్లు, పరీక్షాకేంద్రాల ఏర్పాటు, పర్యవేక్షణ, ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణ వంటివి డీఐఈవో పర్యవేక్షణలో నిర్వహిస్తారు. రాష్ట్రంలో రెగ్యులర్‌ డీవీఈవోలనే జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారులుగా (డీఐఈఓ)లుగా ప్రభుత్వం నియమించింది. వికారాబాద్‌ జిల్లా బాధ్యతలు మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారికి అప్పగిస్తే కళాశాలల సమస్యలపైగాని, పనులపైగాని మహబూబ్‌నగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందంటున్నారు. ఉదాహరణకు పెద్దేముల్‌ మండలానికి చెందిన వారు మహబూబ్‌నగర్‌కు వెళ్లాలంటే కనీసం 100 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటు విద్యార్థులకు, అటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పవంటున్నారు.   
 
వికారాబాద్‌లో ఏర్పాటు చేయాలి..
వికారాబాద్‌లో ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల లెక్చరర్ల సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ద్వారా జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి విషయాన్ని విన్నవించారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్‌ జిల్లా కార్యాలయాన్ని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పూర్తిస్థాయి డీఐఈవోను ఏర్పాటు చేసేంతవరకు రంగారెడ్డి జిల్లా విద్యాధికారికి బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తిచేశారు. 
 
 
మరిన్ని వార్తలు