సమాజంలో తారతమ్యాల నివారణకుఏక విద్యా విధానం

13 Oct, 2013 02:55 IST|Sakshi

 =  ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహం సరికాదు
 =  పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలి : సీఎం
 = సీఎం సిద్ధరామయ్య..
 = సమాజంలో తారతమ్యాలను నివారించవచ్చు
 = మాతృ భాషను విస్మరించరాదు
 = పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలి

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సమాజంలో తారతమ్యాలను నివారించడానికి ఏక విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అనివార్యత ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సామాజిక వర్గ వ్యవస్థ కారణంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యుల మధ్య చాలా తేడా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని పోగొట్టాలంటే ఏక విద్యా విధానం ఒక్కటే మార్గమని అన్నారు.

విధాన సౌధలో శనివారం కన్నడ అభివృద్ధి ప్రాధికార ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులకు కన్నడ మాధ్యమ అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించవద్దని ఎవరూ చెప్పడం లేదని, కన్నడను విస్మరించి ఆంగ్లంపై వ్యామోహం పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. నాణ్యత కలిగిన విద్య లభిస్తే కన్నడ మీడియం విద్యార్థులు పురోగతి సాధించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మీడియంలో చదివితేనే ఉన్నతోద్యోగాలు వస్తాయనే దురభిప్రాయం విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఉందని, దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

 పాలనా, కోర్టు వ్యవహారాలు కన్నడలోనే సాగాలని ఆకాంక్షించారు. కన్నడ మీడియంలో విద్యాభ్యాసం చేసిన వారికి ఎక్కువగా ఉద్యోగాలు లభించేలా చూడాల్సి ఉందన్నారు. రాష్ట్ర భాష, మాతృ భాష కన్నడం కనుక కర్ణాటకలో ప్రతి ఒక్కరూ కన్నడంలో మాట్లాడాల్సిన అనివార్యత ఉందన్నారు. భాషా దురభిమానాన్ని తాను ప్రోత్సహించడం లేదని, అయితే మన భాష, సంస్కృతులకు హాని కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు, మైసూరు డివిజన్ల విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్, బెంగళూరు ఇన్‌ఛార్జి మంత్రి రామలింగా రెడ్డి, కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు