ఊరంతా వనవాసం !

4 Apr, 2016 13:42 IST|Sakshi

 నెలరోజుల్లో ఏడుగురి మృతితో ముందుగానే అడవి బాట
 జంతు బలులు ఇచ్చి మొక్కులు
 తీర్చుకున్న గ్రామస్తులు
 తమిళనాడులో వింత ఆచారం

 
 
క్రిష్ణగిరి : ఊరంతా వనవాసానికి బయలుదేరింది. పుష్కరానికి ఒక్కసారి మేలుమలై గ్రామ ప్రజలు ఒక రోజు పాటు అడ విదారి పడతారు. సూళగిరి సమీపంలోని మేలుమలై గ్రామంలో 400 కుటుంబాలు ఆదివారం ఉదయం వనవాసానికి బయలుదేరారు. అయితే ఈ సారి మాత్రం కొంత ముందుగానే గ్రామదేవత ఆదేశానుసారం గ్రామం అడవి బాటపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు... గత నెల రోజుల వ్యవధిలో ఏడుగురు మరణించడంతో గ్రామస్తుల్లో భయం చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు అందరూ గతనెల 29న ఒకచోటకు చేరి చర్చించారు. ఇదే సమయంలో పూజారి వెంకటేశులుకు మారియమ్మ దేవత పూనకం వచ్చి అమృతవాక్కు పలికిందని, గ్రామానికి అరిష్టం జరిగిందని, గ్రామం మొత్తం వనవాసం చేయాలని అమ్మవారు ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు.

వనవాసానికి ఇంకా రెండేళ్లు ఉన్నా కూడా వనవాసం చేయాల్సిందేనని అమ్మవారు ఆదేశించడంతో గ్రామస్తులు ఆదివారం ఉదయం వనవాసానికి సిద్ధమయ్యారు. ఉదయం 6.30 గంటకు బిక్కనపల్లి అడవికి చేరుకున్నారు. అడవిలో స్నానాలు చేసి విశేషపూజలు చేశారు. గ్రామదేవతకు జంతుబలులిచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం వనభోజనాలు ఆరగించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు మళ్లీ గ్రామదేవతను ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. బోసిపోయిన గ్రామం రాత్రి మళ్లి కళకళలాడింది.  
 
గ్రామ రక్షణ కోసం..
గ్రామానికి ఏ అరిష్టం జరగకుండా వర్షాలు సమృద్ధిగా కురవడం కోసం, పంటపొలాలపై చీడపీడల దాడిని నివారించేందుకు గ్రామంలో చెడ్డ జరగకుండా గ్రామదేవత మొక్కులు తీర్చుకొనేందుకు ప్రతి 12 ఏళ్లకొకసారి తాతల కాలం నుంచి ఈ ఆచారం ఉందని గ్రామపెద్ద మునిరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు