దక్కని అనుగ్రహం

11 Jun, 2017 01:58 IST|Sakshi
దక్కని అనుగ్రహం

కమలం పెద్దల అనుమతి నిరాకరణ
చెన్నైకు దినకరన్‌
మద్దతు దారులతో భేటీ
33కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య
పన్నీరుపై పళని వ్యంగ్యాస్త్రం
నేడు మద్దతుదారులతో పన్నీరు భేటీ
పది మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం
ఎయిమ్స్‌ మంజూరు చేయకుంటే రాజీనామా
కేంద్రానికి మదురైలో హెచ్చరికలు

సాక్షి, చెన్నై: బీజేపీ పెద్దల అనుగ్రహం టీటీవీ దినకరన్‌కు దక్కలేదు. నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్న ఆయన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలు సంఖ్య తాజాగా 33కు చేరింది. ఇక, విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంపై సీఎం పళనిస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు పన్నీరు సెల్వం ఆదివారం మద్దతుదారుల భేటీకి పిలుపునివ్వడం గమనార్హం. కాగా మదురైకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. మదురైకు ఏయిమ్స్‌ మంజూరు చేయని పక్షంలో రాజీనామా చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు పంపించారు. అన్నాడీఎంకే ఎపిసోడ్‌లో సాగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన కంటూ ఓ గ్రూపు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ఢిల్లీ పెద్దల అనుగ్రహం కోసం ప్రయత్నించి ఢీలా పడ్డారు. రెండు రోజులు ఢిల్లీలో తిష్ట వేసినా కమలం పెద్ద అనుమతి దక్కని దృష్ట్యా, నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్నారు. వచ్చి రాగానే, తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు సెంథిల్‌ బాలా జి, పళనియప్పన్‌ ఈ భేటీకి హాజరయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 33కు చేరింది.

ఒట్ట పిడారం ఎమ్మెల్యే సుందరరాజన్‌ దినకరన్‌కు జై కొట్టారు. ఇక, ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అమ్మ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్‌ను ఉద్దేశించి జయలలిత మేన కోడలు, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై నేత దీప ఆరోపించారు. దినకరన్‌కు మున్ముందు సంకట పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. శశికళ కుటుంబానికి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.

విలీనంలో నాన్చుడు :
విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంను ఉద్దేశించి సీఎం పళనిస్వామి పెదవి విప్పారు. సింహం, పులి, నక్క, తోడేలు అంటూ...మాతృగూటికి రావడానికి ఎందుకింత నాన్చుడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, సీఎంపై ఎదురు దాడి చేస్తూ పన్నీరు శిబిరం నేత మధుసూదనన్‌ స్పందించారు.

ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్‌ ఇంటి మెట్లు ఎక్కుతుంటే, వారించకుండా మౌనం వహించడం ఎందుకో అని ప్రశ్నించారు. నిజంగా దినకరన్‌ను బహిష్కరించి ఉంటే, ఆయన్ను కలిసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. అలాగే, మంత్రి జయకుమార్‌ నోటికి కల్లెం వేస్తే శ్రేయస్కరం అని హితవు పలికారు. ఇదిలా ఉండగా, విలీనం విషయంగా నిర్ణయాన్ని తీసుకునేందుకు పన్నీరు సిద్ధమైనట్టున్నారు. ఇందు కోసం ఆదివారం వేలప్పన్‌ చావడిలోని ఓ హాల్‌ వేదికగా మద్దతు నేతల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజీనామా నినాదం :
 బలం పెంపునకు దినకరన్, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పళని, కుర్చీ కైవసానికి పన్నీరు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో మదురై జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అటు కేంద్రానికి, ఇటు తమ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కొత్త నినాదంతో రాజీనామా హెచ్చరికలు చేయడం గమనార్హం.

తంజావూరు చెంగి పట్టిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, మదురైలో ఏర్పాటుకు తొలుత నిర్ణయించిన ఎయిమ్స్‌ ఆసుపత్రి తంజావూరుకు తరలుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో ఎయిమ్స్‌ సాధన లక్ష్యంగా రాజీనామా నినాదాన్ని పది మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకోవడం, ఈ ప్రకటనను స్వయంగా రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ చేయడం గమనించాల్సిన విషయం.

మరిన్ని వార్తలు