విపత్తు నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ

14 May, 2015 23:25 IST|Sakshi

- వెల్లడించిన విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే
- వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని స్పష్టం
సాక్షి, ముంబై:
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ  కార్యక్రమాన్ని అమలు చేస్తామని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మంత్రాలయ భవనంలో చెప్పారు. ఇందుకోసం వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు నేపాల్, పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అభం శుభం తెలియని  విద్యార్థులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తమిళనాడులో ఓ పాఠశాల భవనానికి అగ్ని ప్రమాదం సంభవించింది. పాఠశాల భవనానికి ఒకే వైపు మెట్లు ఉండటంతో ఎటు వెళ్లాలో విద్యార్థులకు అర్థంకాక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు