చర్చలు రద్దు

26 Mar, 2014 02:56 IST|Sakshi

సాక్షి, చెన్నై:  సముద్రంలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాలర్ల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే దాడుల నివారణ సాధ్యమని తేల్చారుు. అందుకు తగ్గ చర్యలను సంఘాల నాయకులు తీసుకున్నారు. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చల ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా జనవరిలో చెన్నై వేదికగా జరిగిన రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు సంతృప్తికరంగా సాగారుు. ఇందులో తీసుకున్న నిర్ణయాల్ని రహస్యంగా ఉంచారు.

 మలి విడత చర్చల్లో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి నిర్ణయాలు ప్రకటించడంతో పాటు అందుకు తగ్గ ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత ఫిబ్రవరి నెలాఖరులో చర్చలకు ఏర్పాట్లు చేస్తే శ్రీలంక అధికారులు స్పందించలేదు. ఎట్టకేలకు ఈ నెల 13న చర్చలకు సర్వం సిద్ధం చేశారు. చర్చలకు మరో వారం ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన 177 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడం వివాదానికి దారి తీసింది. వారందర్నీ విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చర్చల తేదీని ఈ నెల 25కు వాయిదా వేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన కేంద్రం శ్రీలంకతో సంప్రదింపులు జరిపి జాలర్లందర్నీ విడుదల చేయించింది. చర్చలకు ఈ పర్యాయం షురూ అన్న ధీమా పెరిగింది. రెండు రోజుల క్రితం శ్రీలంక నావికాదళం 77 మంది రాష్ట్ర జాలర్లను పట్టుకెళ్లడంతో చర్చలపై నీలి మేఘాలు ఆవహించాయి.

 ఈ క్రమంలో 77 మందిని మంగళవారం విడుదల చేస్తారని అందరూ భావించారు. శ్రీలంక నుంచి వచ్చే సంకేతం మేరకు కొలంబో బయలుదేరడానికి జాలర్ల సంఘాల ప్రతినిధులు, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యూరు. ఏ ఒక్కర్నీ శ్రీలంక ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో చర్చలు రద్దు అయినట్టేనన్న సంకేతం వెలువడింది. అధికారులు చర్చలు వాయిదా వేసుకోవడంతో జాలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా సమస్య కొలిక్కి వ స్తుందనుకుంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు ఆదిలోనే హంస పాదు అన్న చందంగా మారడం జాలర్లను ఆవేదనకు గురిచేసింది. చర్చల్ని పక్కదారి పట్టించడమే లక్ష్యంగా శ్రీలంక సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు