డీకే శివకుమార్‌కు ఘన​ స్వాగతం

26 Oct, 2019 20:42 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: తిహార్‌ జైలు నుంచి విడుదలై సొంత గడ్డకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు డీకే శివకుమార్‌కు ఘన​స్వాగతం లభించింది. శనివారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కార్యకర్తలు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం​ పలికారు. 250 కేజీల యాపిల్‌ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్‌ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి హల్‌చల్‌ చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్‌ ప్రసంగించారు.

మనీల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సెప్టెంబర్‌ 3న ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని తిహార్‌ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో అదేరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. 57 ఏళ్ల శివకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బెంగళూరు రూరల్‌, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వక్కలింగ​ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు.

కర్ణాటక స్పెషల్‌ యాపిల్‌ దండ
యాపిల్స్‌ స్వాగతం పలకడం కర్ణాటకలో ట్రెండ్‌గా మారింది. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు పలువురు అగ్రనేతలు భారీ యాపిల్‌ దండలతో స్వాగతాలు అందుకున్నారు. బాదం పప్పు దండలతో కూడా రాజకీయ నాయకులను స్వాగతించడం కన్నడిగులు మొదలుపెట్టారు. ఇదంతా చూసినవారు ఇదేం పిచ్చి అంటూ కామెంట్లు చేస్తుంటారు.

మరిన్ని వార్తలు