రెబల్స్ బెడద

7 Dec, 2013 23:39 IST|Sakshi
 చెన్నై, సాక్షి ప్రతినిధి : డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌కు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీని ధిక్కరించడమేగాక సవాల్‌కు ప్రతిసవాల్ విసరడం విజయకాంత్‌ను సందిగ్ధంలో పడవేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే కంటే ఎక్కువ స్థానాలు దక్కడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేత హోదాను దక్కించుకున్నారు. ఈ హోదాకు సైతం సీఎం జయలలిత సహకరించారు. అయితే క్రమేణా అన్నాడీఎంకేకు దూరమైన డీఎండీకే అమ్మపాలనను విమర్శిం చడం ద్వారా ప్రతిపక్ష పాత్రను పోషించింది. బహిరంగ సభల్లో సైతం అన్నాడీఎంకే పాలనను విజయకాంత్ దుమ్మెత్తిపోయడం అదే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు రుచించలేదు. ఏ పార్టీ అండతో ఎమ్మెల్యేలుగా గెలిచామో అదే పార్టీని విమర్శించడం సహించలేని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకరొకరుగా అమ్మ పంచన చేరారు. 
 
 ముందుగా మధురై సెంట్రల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ అమ్మకు జై కొట్టారు. ఆ తరువాత వరుసగా పాండియరాజ న్, తమిళలగన్, సురేష్, మైకేల్ రాయప్పన్, శాంతి, అరుణ్‌పాండియన్  అమ్మ ఆశీర్వాదం పొందారు. నియోజ కవర్గ అభివృద్ధి పనుల కోసం అమ్మను కలిసినట్లు వారు సమర్థించుకున్నారు. డీఎండీకేను ధిక్కరించి అన్నాడీఎంకేతో కలిసి తిరుగుతున్న రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా అని డీఎండీకే అధినేత విజయకాంత్ శుక్రవారం సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన రెబల్ ఎమ్మెల్యే ఆర్ సుందరరాజన్ శనివారం ప్రతిసవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయూలని కోరడానికి విజయకాంత్ ఎవరని ప్రశ్నించారు.
 
 ఏళ్లతరబడి ప్రజలకు సేవచేసినందుకే ఓటర్లు తమను ఎమ్మెల్యేలుగా గెలిపించారని ఆయన అన్నారు. తమ గెలుపునకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు సైతం కృషి చేశారని తెలిపారు. పార్టీని ధిక్కరిస్తున్నామని కెప్టెన్ భావిస్తున్నట్లయితే రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుండి డిస్మిస్ చేయడం మంచి మార్గమని పేర్కొన్నారు. తమను డిస్మిస్ చేసే దమ్ముందా అని తాము ప్రశ్నిస్తున్నట్లు సుందరరాజన్ సవాల్ చేశారు. తమిళనాడు ప్రజలకు ఏమీ చేయని విజయకాంత్ ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడం హాస్యాస్పదమని అన్నారు. తమను వెంటనే డిస్మిస్ చేయూలని, లేకుంటే తమ గురించి ఇకపై మాట్లాడరాదని విజయకాంత్‌కు ఆయన హితవు పలికారు.  
 
మరిన్ని వార్తలు