అభ్యర్థుల

10 Feb, 2014 03:56 IST|Sakshi
సాక్షి, చెన్నై : పొత్తు ప్రయత్నాల్ని పక్కనపెట్టి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వేటలో డీఎండీకే అధినేత విజయకాంత్ నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. సీటు కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు డీఎండీకే కార్యాలయానికి తరలివచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయకాంత్ దారెటో అన్నది అంతు చిక్కడం లేదు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటారా? లేక ఏదో ఒక పార్టీతో జత కడతారా? అన్నది ప్రశ్నార్థకమవుతోంది. తమతో అంటే, తమతో జత కట్టాలని బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే ఆఫర్లు ఇచ్చినా విజయకాంత్ ఖాతరు చేయడం లేదు.
 
 ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తుల ప్రస్తావనలు ఇప్పుడే వద్దన్నట్టు ముందుకెళుతున్నారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పార్టీ తరపున ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఇందుకు అనూహ్య స్పందన వచ్చింది. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్లో పోటీకి ఉత్సాహాన్ని చూపు తూ ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో కొందరిని అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో విజయకాంత్ నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి ఆశావహుల ఇంటర్వ్యూలకు శ్రీకారం చుట్టారు. 
 
 ఇంటర్వ్యూలు: పార్టీ ఎన్నికల వ్యవహారాల్ని పరిశీలించేందుకు నాయకులు, ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, కృష్ణమూర్తి, రవీంద్రన్‌తో కూడిన కమిటీ దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి అధినేత విజయకాంత్‌కు సమర్పించారు. తొలిరోజు  తంజావూరు, మైలాడుదురై, నాగపట్నం, చిదంబరం, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీకి దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 
 
 పొత్తు: ప్రతి ఆశావహుడి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించిన విజయకాంత్ పలురకాల ప్రశ్నల్ని సంధించారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు, సామాజిక వర్గాలు, ఆయా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, అక్కడ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయన్న వివరాల్ని సేకరించినట్టు ఓ ఆశావహుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యే రీతిలో జన బలం, ఆర్థిక బలంపైనా ప్రశ్నలు సంధిం చిన ట్టు సమాచారం. విజయకాంత్ పొత్తుకు రెడీ అవుతున్నా,
 
 ఆయా పార్టీలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతోనే కాలయాపన చేయాల్సి వస్తోందంటూ ఎన్నికల పర్యవేక్షణ కమిటీలోని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీజేపీ తీవ్ర స్థాయి లో ఒత్తిడి తీసుకురావడంతోనే ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టారని, ప్రస్తుతానికి అభ్యర్థుల వేటపై పూర్తి స్థాయిలో విజయకాంత్ దృష్టి ఉందన్నారు. సోమవారం నీలగిరి, కోయంబత్తూరు, పొల్లాచ్చి, ఈరోడ్డు, తిరుప్పూర్, నామక్కల్, కరూర్, సేలం, తిరుచ్చి, పెరంబలూరు నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అలాగే 11న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం, తేని, మదురై, దిండుగల్, శివగంగై, పన్నెండున వేలూరు, ఆరణి, అరక్కోణం, శ్రీపెరంబదూ రు, కాంచీపురం, తిరువళ్లూరు, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ చెన్నైలు, పుదుచ్చేరి నియోజకవర్గానికి ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేశారు. ఇంటర్వ్యూల అనంతరం తుది జాబితా సిద్ధం చేయబోతున్నారు. 
మరిన్ని వార్తలు