డీఎంకే కౌన్సిలర్ హత్య

3 Oct, 2016 02:44 IST|Sakshi

 టీనగర్: పడప్పై చర్చి ప్రాంగణంలో డీఎంకే కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి ఆరుగురి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై తాంబరం సమీపాన పడప్పై, పెరియార్ నగర్ ఐదవ వీధికి చెందిన ధనశేఖరన్(35) పడప్పై పంచాయతీ డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా, పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తున్నారు. సొంతంగా లారీ ఉండడంతో ఇతను అదే ప్రాంతంలో ఇసుక క్వారీలను లీజుకు తీసుకున్నారు. కాగా డేవిడ్‌నగర్‌లో ఉన్న ఒక చర్చికి ఆదివారం ఉదయం మోటార్ బైక్‌లో ధనశేఖరన్ బయలుదేరాడు. ఆ సమయంలో రెండు బైకుల్లో వెంబడించిన ఆరుగురు వ్యక్తులు ధనశేఖరన్‌పై కత్తులతో దాడి జరిపింది.
 
  వారి నుంచి తప్పించుకున్న ధనశేఖరన్ అదే ప్రాంతంలోని సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలోకి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ధనశేఖరన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి డీఎంకే శ్రేణులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
 

మరిన్ని వార్తలు