పస లేని ప్రసంగం

18 Feb, 2015 03:12 IST|Sakshi
పస లేని ప్రసంగం

 కొత్తదనం లేకుండానే, ఉన్నట్టుగా చూపిస్తూ, గవర్నర్ కొణిజేటి రోశయ్య నోట పసలేని ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం పలికించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడంతో, ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభా పర్వాన్ని 4 రోజులకే పరిమితం చే స్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 
 సాక్షి, చెన్నై : కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం అనగానే ప్రాధాన్యత నెలకొంటుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఈ ప్రసంగం ద్వారా ఏడాదిలో చేపట్టబోయే సరికొత్త పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ నోట పలికిస్తుంటారు. అయితే, ఈ ఏడాది అందుకు భిన్నంగా గవర్నర్ ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిందని చెప్పవచ్చు. తమ అమ్మ జయలలితకు ఎదురైన కష్టాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని సైతం పస లేకుండా రూపొందించారన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సీఎం పన్నీరు సెల్వంకు నెలకొంది. సీఎంగా పన్నీరు సెల్వంకు కొత్త ఏడాదిలో తొలి సమావేశం ఇది. అలాగే, గవర్నర్ ప్రసంగంతో ఆరంభం అయ్యే సభా పర్వం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇందు కోసం ప్రభుత్వం జార్జ్ కోటలో ఏర్పాట్లు చేసింది. అయితే, మునుపటి వల్లే పలు రకాల పువ్వులతో అలంకరణలు లేవు.
 
 హంగు ఆర్భాటాలు లేవు. అలాగే, ప్రజలకు ఈ ఏడాది ఎలాంటి కొత్త ప్రగతి పథకాలు లేవన్నట్టుగా సభా పర్వం మంగళవారం ఉదయం 11.15 గంటలకు ఆరంభమైంది.  అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన రోశయ్యకు స్పీకర్ ధనపాల్ ఆహ్వానం పలికారు. అసెంబ్లీలో సభ్యులందరూ గవర్నర్ రోశయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. గత సమావేశాల్లో మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం పన్నీరు సెల్వం ఈ సారి సీఎం సీటులో కూర్చోవడం విశేషం. దీంతో ఆ సీటుకు గౌరవాన్ని ఇస్తూ, డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ నమస్కారం చేయక తప్పలేదు. సభ ఆరంభం కాగానే,  రోశయ్య ప్రసంగం ఆరంభమైంది. 45 నిమిషాల పాటుగా ఆయన ప్రసంగం సాగింది. అయితే, ఇందులో కొత్తదనం లేకపోవడంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడం డీఎంకే, సీపీఐ, పుదియ తమిళగంలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ డుమ్మా కొట్టినా, డీఎండీకే సభ్యులు, సీపీఎం, ఎంఎంకే, ఎస్‌ఎంకే, పీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభలో ఆశీనులై గవర్నర్ రోశయ్య ప్రసంగాన్ని ఆలకించారు.
 
 ప్రసంగంలో మచ్చుకు కొన్ని
 తన  ప్రసంగంలో కొన్ని నిర్ణయాలు, గతంలో ప్రభుత్వం  చేసిన గొప్పలను ఎత్తి చూపుతూ గవర్నర్ రోశయ్య వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అన్ని గ్రామాలకు ప్రజా సేవా కేంద్రాల విస్తరణ, అరసు కేబుల్ విస్తరణ, క్రీడాకారులకు ప్రోత్సాహం, పెట్టుబడి దారుల్ని ఆహ్వానించే విధంగా మేలో మహానాడు నిర్వహణ, జపాన్ బ్యాంక్ ద్వారా నిధుల్ని రాబట్టడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు. ఇక, కచ్చదీవుల స్వాధీనంతోనే జాలర్ల సమస్యకు పరిష్కారం సాధ్యమన్నారు. శ్రీలంక తమిళులకు కొత్త ప్రభుత్వంతో ఒరిగేది శూన్యమేనని విమర్శించారు. వారికి సకల ఏర్పాట్లు చేసినానంతరం శిబిరాల నుంచి వారి వారి స్వదేశాలకు ఈలం తమిళుల్ని పంపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీల ఏర్పాటులో తమిళనాడుకు ప్రాధాన్యత కల్పించాలని, రాష్ట్రంలోని కార్పొరేషన్లను ఆ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు.
 
 టెక్నాలజీని అంది పుచ్చుకుని అన్ని ప్రభుత్వ సేవల్ని ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న విధానం గురించి వివరించారు. కోయంబేడు - ఆలందూరు మధ్య త్వరలో మెట్రో రైలు సేవలు ఆరంభం కానున్నాయని పేర్కొన్నారు. తిరువొత్తియూర్ వరకు మెట్రో సేవల విస్తరణకు త్వరలో ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  నదీ జలాల పరిరక్షణలో, మహిళా, శిశు సంరక్షణలో, వ్యవసాయ రంగం పటిష్టత , ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతల పనితీరుపై పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అమ్మ సిమెంట్ రికార్డుల్లోకి ఎక్కిందని పేర్కొంటూ, విజన్ -2023లోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రసంగం చేశారు. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే, ముల్లై పెరియార్‌కు వ్యతిరేకంగా కేరళ, కావేరి జలాల్ని అడ్డుకునే రీతిలో కర్ణాటక కొత్త డ్యాంల నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఖండిస్తూ, అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సభా పర్వం తొలి రోజు ముగియగానే, అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమై సభను నాలుగు రోజులు నడిపించేందుకు నిర్ణయించారు.  
 
 విమర్శలు : గవర్నర్ ప్రసంగంపై ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పస లేని ప్రసంగంలా సాగిందని మండి పడుతున్నాయి. వాకౌట్ అనంతరం బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రభుత్వ తీరుపై శివాలెత్తారు. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. నోటుతో ఓట్లను కొనుగోలు చేసి శ్రీరంగంలో గెలిచారని విమర్శించారు. బినామీ పాలన రూపంలో ప్రజలకు అష్టకష్టాలు తప్పదని హెచ్చరించారు. పుదియ తమిళగం సభ్యుడు కృష్ణస్వామి, సీపీఐ సభ్యులు సైతం ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటనలో గవర్నర్ ప్రసంగాన్ని ఎండమావిగా అభివర్ణించారు. ఎవరికి పనికి రాని ఈ ప్రసంగాన్ని ఎందుకు చదివి వినిపించారంటూ మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, సంప్రదాయ బద్దంగా నమా అనిపించినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చదీవుల స్వాధీనంతో జాలర్ల సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఐజేకే నేత పారివేందర్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తదితరులు గవర్నర్ రోశయ్య ప్రసంగంపై దుమ్మెత్తి పోశారు. సభను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు ప్రజల మీద చిత్తశుద్ది ఉందో స్పష్టం అవుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పస లేని దృష్ట్యా, అసెంబ్లీ నిర్వహణ వృథా ప్రయాసేనని ధ్వజమెత్తారు.  
 

మరిన్ని వార్తలు