తొలిరోజే వాకౌట్

26 Mar, 2015 01:44 IST|Sakshi

 స్పీకర్ వ్యాఖ్యలపై డీఎంకే నిరసన
  నల్ల చొక్కాలతో బైఠాయించిన
 డీఎండీకే ఎమ్మెల్యేలు
 
 సాక్షి, చెన్నై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజే వాకౌట్ల పర్వానికి డీఎంకే శ్రీకారం చుట్టింది. తమను లోనికి అనుమతించక పోవడంతో ప్రవేశ ద్వారం వద్ద నల్లచొక్కాలతో డీఎండీకే ఎమ్మెల్యేలు బైఠాయించారు. వీరి నిరసనకు డీఎంకే మద్దతు ప్రకటించింది. బడ్జెట్ దాఖలు వేళ ప్రతిపక్ష నేత విజయకాంత్ యథాప్రకారం డుమ్మా కొట్టారు. పన్నీరు దాఖలు చేసిన బడ్జెట్ ‘జీరో’ అంటూ ప్రతి పక్షాలు విమర్శించే పనిలో పడ్డాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు బుధవారం ఉదయం సభ ఆరంభం కాగానే, స్పీకర్ ధనపాల్ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను చ దివి వినిపించారు. అనంతరం బడ్జెట్ దాఖలు చేయాలంటూ సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు సూచించారు. ఈ సమయంలో డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని బడ్జెట్‌పై ఏదో ఒక అంశాన్ని ప్రస్తావించే యత్నం చేశారు.
 
 ఇందుకు స్పీకర్ నిరాకరిస్తూ కూర్చోండంటూ హెచ్చరించడంతో డీఎంకే సభ్యులు అందరూ తాము బడ్జెట్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించి వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, బినామి ప్రభుత్వం దాఖలు చేసిన బడ్జెట్‌ను బహిష్కరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో, అవినీతి ఊబిలో కూరుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చే సూచనను కూడా వినే స్థితిలో స్పీకర్ లేకపోవడం శోచనీయమని విమర్శించారు. నల్ల చొక్కాలతో డీఎండీకే : గత అసెంబ్లీ సమావేశాల్లో డీఎండీకే సభ్యుల్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం ఆ పార్టీ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు. అయితే, వారికి  అనుమతి లేని దృష్ట్యా, ప్రవేశ మార్గంలో బైఠాయించారు.
 
 స్పీకర్‌కు వ్యతిరేకంగా, రాష్ర్ట ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపుతూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. ఆ పార్టీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించిన డీఎండీకే సభ్యుల నినాదాలతో ఆ పరిసరాలు దద్దరిల్లాయి. అదే సమయంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ నేరుగా డీఎండీకే సభ్యుల వద్దకు వెళ్లి తన మద్దతు తెలియజేశారు. సస్పెన్షన్ ఎత్తి వేత లక్ష్యంగా అసెంబ్లీలో గళం విప్పుతామని, సంపూర్ణ మద్దతు సభలో ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ, తమ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తాము వ్యవహరిస్తుంటే, అందుకు భిన్నంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
 జీరో బడ్జెట్: సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం దాఖలు చేసిన బడ్జెట్ ‘జీరో’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. డీఎంకే కోశాధికారి స్టాలిన్ పేర్కొంటూ, పసలేని బడ్జెట్ అని, బినామీ పాలన అన్నది ఈ బడ్జెట్‌లో స్పష్టం అవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యురాలు విజయ ధరణి పేర్కొంటూ, సీఎం పన్నీరు సెల్వం ప్రకటన చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకు పోయిన విషయం స్పష్టం అవుతోందన్నారు. ప్రజాపయోగకరంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం శోచనీయమని విమర్శించారు. పుదియ తమిళగం నేత, ఎమ్మెల్యే కృష్ణ స్వామి పేర్కొంటూ, బడ్జెట్ సున్నా..! అని ముందుకు సాగారు. ఎస్‌ఎంకే నేత, ఎమ్మెల్యే శరత్‌కుమార్ పేర్కొంటూ, ప్రజల మీద కొత్తగా ఎలాంటి పన్నుల మోత లేని దృష్ట్యా, అభినందనీయమని ముగించారు.  
 

మరిన్ని వార్తలు