సేవలు బహు బాగు

28 Sep, 2014 21:50 IST|Sakshi

ఢిల్లీ మెట్రో నిక్కచ్చితత్వానికి పెట్టింది పేరు. నిర్దేశిత సమయానికే స్టేషన్‌కు గమ్యస్థానానికి చేరుతుంది.  న్యూఢిల్లీ: ప్రయాణికుల మనసులను దోచుకోవడంలో 18 అంతర్జాతీయ మెట్రోల్లో ఢిల్లీ మెట్రో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. గ్లోబల్ మెట్రో బెంచ్‌మార్కింగ్ గ్రూప్స్ అయిన నోవా, కోమట్ సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ మెట్రో సేవలపై అధ్యయనం చేశాయి. ప్రజారవాణా వ్యవస్థల్లో అత్యుత్తమ సేవలకు సంబంధించి యూరోపియన్ ప్రమాణాల ప్రకారం ఈ సంస్థలు అధ్యయనం చేశాయి.
 
 ఇందులోభాగంగా అందుబాటు, వినియోగం అత్యంత సులువుగా ఉండడం, ప్రయాణానికి ముందే సమాచారం అందుబాటులో ఉండడం, ప్రయాణ సమయంలో నిరంతరం సమాచారం అందించడం, విశ్వసనీయత, ప్రయాణికుడికి ప్రాధాన్యత, వారికి తగు భద్రత తదితర అంశాల ప్రాతిపదికగా ఈ అధ్యయనం సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీనుంచి మే 25వ తేదీవరకూ అధ్యయనం చేశారు. ఇందుకోసం పలు ప్రముఖ వెబ్‌సైట్‌లు, సామాజిక మీడియాలను వేదికగా చేసుకున్నారు. ప్రపంచంలోని 18 ప్రముఖ మెట్రో రైళ్ల సేవలను వినియోగిస్తున్న దాదాపు 41 వేలమంది అభిప్రాయాలను సేకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. హాంగ్‌కాంగ్ ఎంటీఆర్, లండన్ అండర్‌గ్రౌండ్, మెట్రో డీ మాడ్రిడ్, ప్యారిస్ ఆర్‌ఏటీపీ, న్యూక్యాజిల్ నెక్సస్, మెట్రో రియో తదితర ప్రముఖ సంస్థలను ఇందులోభాగస్వాములను చేశారు. ఈ అధ్యయనంలో ఢిల్లీ మెట్రో ద్వితీయ స్థానంలో నిలవగా, లండన్ డాక్‌లాండ్స్ లైట్ రైల్వే, బ్యాంకాక్ మెట్రోలకు ఆ తర్వాతి స్థానం లభించింది.
 
 ఐదు మార్గాల్లో సేవలు
 2002, డిసెంబర్ 24వ తేదీన ఢిల్లీ మెట్రో సేవలు మొదలయ్యాయి. మొత్తం ఐదు మార్గాల్లో  ఢి ల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 2.4 మిలియన్ మంది ప్రయాణికులు వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తం రైళ్ల సంఖ్య 204 కాగా వీటికి నాలుగు, ఆరు, ఎనిమిది చొప్పున బోగీలు ఉంటాయి. నగరంతోపాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా వీటి సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో కోల్‌కతా తరువాత ఇదే అతి పెద్ద మెట్రో రైలు వ్యవస్థ. ఈ మెట్రో మార్గం మొత్తం పొడవు 193.2 కిలోమీటర్లు కాగా స్టేషన్ల సంఖ్య 139.
 
 మూడో దశకు నిధులు
 న్యూఢిల్లీ: మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఈక్విటీ  వాటా కింద ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కి రూ. 200 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. నిధుల విషయంలో కొన్ని కఠినతరమైన నిబంధనలను విధించామన్నారు. డీఎంఆర్‌సీ తన ప్రాజెక్టులను నిర్దేశిత కాలవ్యవధిలోగానే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్థిక, రవాణా, ప్రణాళికా విభాగాల పురోగతికి సంబంధించి కు ఈ సంస్థ ప్రతి నెలా తన నివేదికలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ చేసిన వినియోగపత్రాన్ని తమకు అందజేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి కూడా ఆడిట్ చేసిన వినియోగపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఈక్విటీ వాటా నిధులను నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. డీఎంఆర్‌సీ పనితీరును రవాణా శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తుం దన్నారు. నిర్దేశిత లక్ష్యాలను డీఎంఆర్‌సీ సాధించిందా లేదా అనే అంశంపైనా ఈ శాఖ తమకు నివేదిస్తుందన్నారు.
 

మరిన్ని వార్తలు