గ్రామ పంచాయతీ బరిలో కోటీశ్వరురాలు

22 Jan, 2014 00:05 IST|Sakshi

 సాక్షి, ముంబై: నవీముంబైలోని ఖార్‌ఘర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకంగా రూ.200 కోట్లు ఆస్తులున్న ఓ మహిళ అభ్యర్థి పోటీ చేయడం స్థానిక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నామినేషన్‌లో పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయని, పన్ను ఏటా ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు  లీనా గరాడ్ తెలిపి ఆశ్చర్యంలో ముంచెత్తారు.
 
 ఖార్‌ఘర్ గ్రామపంచాయతీకి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో రూ.200 కోట్ల ఆస్తులున్న లీనా గరాడ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె ఖార్‌ఘర్ కాలనీ ఫోరం తరఫున వార్డు నంబర్-3 నుంచి పోటీ చేశారు. లీనా భర్త అర్జున్ గరాడ్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు నెలకు రూ.30 వేల జీతం. అయితే ఈ డబ్బులతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడగట్టారనేది రాజకీయ నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
 
 ఇదివరకు జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వెల్లడించిన ఆస్తులు ఈ స్థాయిలో లేవని తెలుస్తోంది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయో ఆమె వెల్లడించారు. ‘ప్రస్తుతం నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ మాకు అనేక సొంత స్థలాలున్నాయి. విమానాశ్రయం కారణంగా ప్రస్తుతం వాటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. తాను గత 13 ఏళ్ల నుంచి బిల్డర్ రంగంలో ఉన్నాను. తమ వద్ద 17 వివిధ రకాల కంపెనీల కార్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం వాహనాలకు నంబర్లు 100 ఇలా ఉన్నాయి.
 
 అందుకు ఆర్టీఓ అధికారులు కేటాయించిన మొత్తాన్ని చెల్లించి ఈ లక్కీ నంబర్లను పొందామ’ని వివరించారు. ఈ వాహనాల కొనుగోలుకు రూ.10 కోట్లు రుణాలు తీసుకున్నామని వెల్లడించారు.
 అయితే ప్రముఖ రాజకీయ నాయకులు  గణేశ్ నాయక్ (ఎన్సీపీ) రూ.3 కోట్లు,  అజిత్ పవార్(ఎన్సీపీ) రూ.10 కోట్లు, అశోక్ చవాన్ (కాంగ్రెస్) రూ.24 కోట్లు, సురేశ్ జైన్ (శివసేన) రూ.82 కోట్లు, మంగళ్ లోఢా (బీజేపీ) రూ.68 కోట్లు ఉన్నట్టు వారు పోటీచేసినప్పుడు ఈసీకి సమర్పించిన నామినేషన్‌లలో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు