అసత్య ప్రచారమొద్దు

21 Dec, 2014 03:01 IST|Sakshi
అసత్య ప్రచారమొద్దు

లింగాపై సత్యదూర ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచా రం సాగుతోంది.
 
 చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నారుు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది. లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది.
 
 ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను  కేఎస్.రవికుమార్ ఖండించారు.
 

మరిన్ని వార్తలు