నేను చెప్పే వరకు ఆ ప్రచారాలు నమ్మొద్దు

29 Jun, 2015 03:41 IST|Sakshi
నేను చెప్పే వరకు ఆ ప్రచారాలు నమ్మొద్దు

 నేను చెప్పే వరకు నా ప్రేమ, పెళ్లి వంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దంటున్నారు నటి అనుష్క. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అది ఒక్క అనుష్కతోనే సాధ్యమన్నంతగా పేరు సంపాదించుకున్న నటి ఈ యోగా సుందరి. అలా అరుంధతితో మొదలైన ఈమె హవా తాజా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి వరకు అప్రాహతంగా సాగుతోంది. ప్రస్తుతం వంద కోట్లు దాటిన బడ్జెట్లతో చారిత్రాత్మక కథాంశాలతో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాలు త్వరలో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి రెండూ అనుష్క సినీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అనుష్కతో ముచ్చట్లు.
 
 ప్రశ్న : మీ యోగాకు ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందడం గురించి మీ స్పందన?
 జవాబు : చిన్న దిద్దుబాటు. నా యోగా కాదు. మన యోగా. ఇకపోతే నేను నటినని చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతున్నానో, ఒక యోగా టీచర్ అని చెప్పుకోవడానికి అంత గొప్పగా భావిస్తున్నాను. యోగా మన భారతదేశం ఆధ్యాత్మిక సొత్తు. దాన్ని రక్షించుకోవాలి. యోగాకిప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం సంతోషం.
 
 ప్రశ్న : మిమ్మల్ని నమ్మి వంద కోట్లకుపైగా బడ్జెట్ చిత్ర నిర్మాణాలు సాగుతున్నాయి. దీనికి మీరు ఎలా ఫీలవుతున్నారు?
 జ: పలు కోట్ల బడ్జెట్, బ్రంహ్మాడ చిత్రం లాంటివేవీ నేను చూడను. నన్ను నమ్మి ఇచ్చే పాత్రలకు నిజంగా నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాను. ఇక బడ్జెట్ అనేది నిర్మాతకు బ్రహ్మాండం అన్నది దర్శకుడికి సంబంధించిన విషయాలు. నా శ్రమ వృథా కాకూడదన్న అంశం గురించి దర్శక నిర్మాతల్ని గమనిస్తుంటాను. దర్శకుడు రాజమౌళి చిత్రాలను నమ్మి శ్రమిస్తే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అలా చేసిన చిత్రం విక్రమార్కుడు. ఇప్పుడు బాహుబలి.
 
 ప్రశ్న : పాత్ర పోషణ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాంటి డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేయకుండా అవార్డులకు దూరమవుతున్నారే?
 జ : ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను అభిమానుల్ని అలరించడానికే నటిస్తున్నాను గానీ అవార్డుల కోసం కాదు. ఏం చేస్తే పాత్రకు బలం చేకూరుతుందో అది చేస్తాను. నేను నటించిన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెబితే ఉన్నతంగా ఉంటుందంటే అలా చేయడానికి నేను ఏ మాత్రం సందేహించను.
 
 ప్రశ్న : సరే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఇంజి ఇడుప్పళగి, సింగం-3 అంటూ వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు?
 జ: విశ్రాంతి తీసుకోనున్నట్లు నేనెప్పుడూ ఎక్కడా? అనలేదు. రుద్రమదేవి, బాహుబలి చిత్రాల తరువాత పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వనున్నట్లు మీరే ప్రచారం చేశారు. ఎవరేం చెప్పుకున్నా నేను నటించుకుంటూ పోతాను.
 
 ప్రశ్న : పెళ్లి ప్రస్తావన ఎలాగూ వచ్చింది కాబట్టి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కనున్నారు?
 జ: నా నట జీవితం దశాబ్దం పూర్తి చేసుకుంది. ఒక్క సారి తిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. తదుపరి వివాహమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్త్రీకి వివాహం చాలా ముఖ్యం అన్న విషయం తెలుసు. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆలోగా ప్రేమ పుట్టవచ్చు. లేదా తల్లిదండ్రులే మంచి వరుణ్ని చూడవచ్చ. ఏ విషయాన్నైనా ఆ సమయం వచ్చినప్పుడు బహిరంగంగానే చెబుతాను. అంత వరకూ నా ప్రేమ, పెళ్లి గురించి ఎవరేమి చెప్పినా నమ్మవద్దు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా