డాక్టర్‌ సారూ.. ఆస్పత్రిలో లేరు

27 Feb, 2019 12:13 IST|Sakshi
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల నిరీక్షణ

ప్రైవేటు ఆస్పత్రుల సేవలో నిపుణులు  

ప్రభుత్వాసుపత్రుల్లో తీవ్రంగా సిబ్బంది కొరత

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు రూ.లక్షలు జీతాలు తీసుకుంటూ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. ఓ వైపు వైద్యుల కొరత వేధిస్తోంది. కాగా ఉన్న డాక్టర్లు కూడా సక్రమంగాపని చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలు గాలిలో దీపంగా మారింది. మహిళా రోగాల నిపుణులు, చిన్న పిల్లల నిపుణులు, ఎముకలు–కీళ్లు, కంటి, ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు), ప్లాస్టిక్‌ సర్జన్‌లు, మూత్రపిండాల వైద్య నిపుణులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నప్పటికీ రోగులకు దొరకడం లేదు. వారి కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్య నిపుణులు లేరనే మాట వినిపిస్తోంది. దీంతో ప్రాణాంతక వ్యాధులతో చనిపోతున్న సంఖ్య వారి సంఖ్య పెరుగుతోంది.

ఏ జిల్లా చూసినా నిపుణుల కొరతే
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికల ప్రకారం కోలారు, తుమకూరు, కలబుర్గితో పాటు మిగతా జిల్లా ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్‌ డాక్టర్లు కొరతగా ఉన్నారు. పలు ఆస్పత్రుల్లో చర్మరోగ డాక్టర్లు కూడా కొరతగానే ఉన్నారు. కొడగు, తిపటూరు, చిక్కోడి, కలబుర్గి సర్వజన ఆస్పత్రుల్లో మినహా మిగతా ఆస్పత్రుల్లో కంటి వైద్యులు లేరు. 33 జనరల్‌ ఆస్పత్రుల్లో రేడియాలజీ నిపుణులు, అనస్తీషియా (మత్తు) డాక్టర్లు కరువయ్యారు. సుమారు 150 ఆస్పత్రుల్లో చిన్న పిల్లల డాక్టర్ల కొరత వేధిస్తోంది. ప్రసూతి ఆస్పత్రుల్లోనూ సిబ్బంది కొరత పీడిస్తోంది. 

13 వేల మందికి ఒకే డాక్టర్‌  
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్‌ ఉండాలి. భారతీయ వైద్య మండలి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కర్ణాటకలో ప్రతి 13,556 మంది ప్రజలకు ఒక డాక్టర్‌ చొప్పున ఉన్నారు. ఫలితంగా ఒక్కో డాక్టర్‌ అదనంగా పని చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో డాక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో ఉద్యోగం మానేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  
రాష్ట్రంలోని హావేరి జిల్లా హిరేకరూర్‌ తాలుకా ఆస్పత్రిలో స్త్రీ రోగాలకు మహిళా డాక్టర్లు లేరు. ఫలితంగా పురుష డాక్టర్లే వైద్యం చేస్తున్నారు.  
శివమొగ్గ జిల్లాలో మంకీ ఫీవర్‌ కారణంగా చాలామంది డాక్టర్లు ఉద్యోగం మానేశారు. అయితే ఆయా స్థానాలు భర్తీ చేసేందుకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ ఇంతవరకు డాక్టర్లు ఎవరూ విధుల్లోకి రాలేదు.  
రాయ్‌చూర్‌ వైద్య కళాశాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంది. అయితే ఎలాంటి సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో ఐదు విభాగాలు ఉన్నప్పటికీ ఒకరే డాక్టర్‌ ఉన్నారు. నరాల రోగానికి, గుండె చికిత్సకు డాక్టర్లు లేరు.  
బెళగావి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే జిల్లా ఆస్పత్రిలో న్యూరో విభాగంలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. హృదయ చికిత్స వైద్యులు కూడా లేరు.
చిత్రదుర్గ జిల్లాలోని మూడు తాలుకా ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యులు లేరు. మొలకల్మూరులోనూ ఇదే పరిస్థితి.

మరిన్ని వార్తలు