గర్భిణికి నరక వేదన

27 Apr, 2019 10:51 IST|Sakshi
అర్ధరాత్రి వైద్యశాల వద్ద డిప్యూటీ డైరెక్టర్‌ను ముట్టడించి ఆందోళన చేస్తున్న బాధితులు

ప్రసవం కోసం వచ్చిన మహిళకు

గర్భసంచి తొలగింపు నార్మల్‌ డెలివరీ పేరిట కాలయాపన

శిశువు మృతి అర్ధరాత్రి ఆందోళనలతో

అట్టుడికిన వైద్యశాల

తిరువళ్లూరు: ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన మహిళకు గర్భసంచి తొలగించిన సంఘటన తిరువళ్లూరు జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. కాంచీపురం జిల్లా పిచ్చువాక్కం గ్రామానికి చెందిన రాజేష్‌ (22), ఓరత్తూరు గ్రామానికి చెందిన స్నేహ(19)కు 2018 మార్చిలో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లా రామంజేరిలోని బంధువుల వద్ద ఆశ్రయం పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న స్నేహను బుధవారం సాయంత్రం ఏడు గంటలకు పట్రపెరంబుదూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలో ప్రసవం కోసం చేర్పించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే చికిత్స అందించారు. స్నేహకు నార్మల్‌ డెలీవరి ఆయ్యే అవకాశం ఉందని, అపరేషన్‌ వద్దని సూచించిన నర్సులు గురువారం సాయంత్రం వరకు ఎలాంటి చిక్సిత చేయకుండానే కాలయాపన చేశారు. తీరా 8 గంటలకు స్నేహకు నార్మల్‌ డెలీవరి కాగా, శిశువు మృతి చెందింది. అయితే శిశువు మృతి చెందిన నేపథ్యంలో డెలీవరీ అయిన మహిళను పట్టించుకోకపోవడంతో పాటు డాక్టర్‌ వైద్యశాలకు రాకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలిసింది. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో పాటు ఎంత శ్రమించినా బ్లీడింగ్‌ ఆగకపోవడంతో ఆమెను మెరుగైన చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి పది గంటలకు రెఫర్‌ చేశారు. అయితే తిరువళ్లూరు వైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌ కృష్ణరాజ్‌ నేతృత్వంలోని ఐదు మంది ప్రత్యేక డాక్టర్లు మూడు గంటల పాటు శ్రమించినా బ్లీడింగ్‌ ఆగకపోవడంతో ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. అనంతరం భర్త అనుమతితో అపరేషన్‌ చేసి గర్భసంచిని తొలగించి మెరుగైన చిక్సిత కోసం చెన్నై వైద్యశాలకు తరలించారు.

అర్ధరాత్రి ఆందోళనలు:యువతికి గర్భసంచి తొలగించారన్న విషయం బంధువులకు తెలియడంతో అర్దరాత్రి 1 గంటకు తిరువళ్లూరు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రసవం కోసం చేరిన యువతికి పట్రపెరంబుదూరులో చిక్సిత సరిగ్గా అందించక పోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించిన బంధువులు, గర్భసంచి  తొలగించి యువతి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.  వైద్యశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అర్ధరాత్రి బంధువుల ఆందోళనతో తిరువళ్లూరు వైద్యశాల వద్ద కలకలం రేగింది.

ఇద్దరు నర్సుల బదిలీ–విచారణకు రావాలని డాక్టర్‌కు ఆదేశం: శిశువు మృతి, మహిళకు గర్భసంచి తొలగింపు వ్యవహరం తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో పట్రపెరంబుదూరులో పని చేస్తున్న ఇద్దరు నర్సులను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. విధులకు హాజరుకానీ డాక్టర్‌ను విచారణకు హజరు కావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు