తెలుగువారిని ప్రభు కరుణించేనా?

24 Feb, 2015 23:57 IST|Sakshi
తెలుగువారిని ప్రభు కరుణించేనా?

సాక్షి ముంబై: పార్లమెంట్‌లో రైల్వే మంత్రి గురువారం ప్రవేశపెట్టనున్న 2015-16 రైల్వే బడ్జెట్‌పై తెలుగువారు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు. ముంబైకి చెందిన సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నందున మహారాష్ట్రతో పాటు ఇక్కడి తెలుగు ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు దక్కుతాయని ఆశిస్తున్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు కన్నా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్ తదితర చుట్టుపక్కల నివసించే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు దేవగరి ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు, గత ఏడాది ప్రారంభమైన లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి), నిజామాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌పై ఆధారపడుతున్నారు.

అయితే వారానికి ఒకసారి నడిచే ఎల్టీటీ-నిజామాబాద్ రైలు ఠాణేలో ఆపకపోవడం, సమయం తదితర కారణాల వల్ల ఆ రైలు అనేక మందికి అసౌకర్యంగా ఉంది. ఇక దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలులో సీజన్, అన్ సీజన్ అన్న తేడాలేకుండా సంవత్సరం పొడవునా టిక్కెట్లు లభించడం కష్టసాధ్యంగా మారింది. అదే విధంగా సికింద్రాబాద్‌కు దేవగిరి రైలును పొడగించిన తర్వాత టిక్కెట్ల కోసం నిజామాబాద్‌కంటూ ప్రత్యేక కోటా లేకుండా పోయింది. దీంతో నిజామాబాద్   వరకు తాత్కాల్ టిక్కెట్లు తీసుకుందామన్న కూడా క్షణాల్లో వెయిటింగ్ లిస్ట్‌కు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు నిజామాబాద్‌కు కూడా టిక్కెట్ల కోటా కేటాయించడంతో పాటు ఈ మార్గంలో మరో రైలును నడుపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే నగరంలోని తెలుగు సంఘాలు పోరాడుతున్నాయి.

ఈ బడ్జెట్‌లో కొత్త రైలును ప్రకటించకపోయినా కనీసం ప్రస్తుతమున్న ఎల్‌టీటీ-నిజామాబాద్‌ల వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రతి రోజు నడపాలని, దేవగిరి రైలులో మరిన్ని బోగీలను జత చేయాలని, ముంబై-నాందేడ్-సికింద్రాబాద్ సెక్టర్‌లో నడిచే ఏదైనా ఓ రైలును పొడగించాలని కోరుతున్నారు. ఇలాంటి వాటిలో ప్రస్తుతం సికింద్రాబాద్-మన్మాడ్‌ల మధ్య నడుస్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్, ముంబై-నాందేడ్‌ల మధ్య నడుస్తున్న తపోవన్ ఎక్స్‌ప్రెస్, నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. వీలైతే నిజామాబాద్ మీదుగా మన్మాడ్, నాగర్‌సోల్‌లవరకు నడుస్తున్న రైళ్లను ముంబై వరకు పొడిగించాలని కూడా తెలుగు ప్రజలు కోరుతున్నారు. వీటితో ఆపటు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేట్రాక్‌ను తొందరగా పూర్తి చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
 
ఠాణేలో స్టాప్ ఇవ్వాలి...
ముంబై నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లను ఠాణేలో ఆపాలని ఇక్కడి తెలుగు వారు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లోనైనా తమ సమస్యకు పరిష్కారం లభించగలదని తెలుగువారు ఆశిస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో శ్రీకాకుళం, విజయనగరం. ఉభయగోదావరి జిల్లాల వాసులు కూడా నివసిస్తున్నారు.

వీరందరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం, వారానికి రెండు రోజులు నడిచే కాకినాడా ఎక్స్‌ప్రెస్‌లపై ఆధారపడుతున్నారు. అయితే ఈ రైళ్లేవీ ఠాణేలో ఆగడం లేదు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిని కూడా దృష్టిలో ఉంచుకుని విశాఖపట్టణం రైలును ఇచ్ఛాపురం వరకు పొడగించాలని వీరు కోరుతున్నారు. రాజ్‌కోట్-సికింద్రాబాద్, పోర్‌బందరు-సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తున్న రైళ్లలో భివండీలో నివసించే తెలుగు ప్రజల కోసం ఓ బోగీని జతచేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
షోలాపూర్-హైదరాబాద్‌ల మధ్య కొత్తగా ఓ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని ఇక్కడి తెలుగు ప్రజలు కోరుతున్నారు. పుణే నుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం పుణే నుంచి నేరుగా హైదరబాద్‌కు ఉదయం ఒక రైలు, లాతూరు మీదుగా మరో రైలు ఉంది. పుణేలో నివసించే తెలుగు ప్రజలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు ఇంకో రైలును నడపాలని స్థానిక తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు