శునకాల బాధ్యత యజమానులదే

14 Nov, 2019 07:59 IST|Sakshi

పార్కును గలీజు చేస్తేశుభ్రం చేయాలి  

కబ్బన్‌ ఉద్యానంలో చర్యలు  

కర్ణాటక,శివాజీనగర: కబ్బన్‌ పార్కులో జంటలు ఫోటో షూట్‌లో అనుసరించాల్సిన విధానాలను సూచించిన తరువాత శునకాల బెడదపై దృష్టి సారించారు. పార్కులో జాగిలాలు గలీజు చేస్తే వాటి యజమానులే దానిని శుభ్రం చేయాలని ఉద్యానవన శాఖ స్పష్టంచేసింది. ప్రతిరోజు కబ్బన్‌ పార్కులో వందలాది మంది జాగిలాలతో వాకింగ్‌ చేస్తారు. ఈ సమయంలో కుక్కలు పార్కులో ఎక్కడపడితే అక్కడ గలీజు చేస్తుండడంతో సందర్శకులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా ఉద్యానవన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పార్కులోకి వచ్చే ప్రజలు ఉద్యానవనాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శాఖతో సహకరించాలని అధికారులు కోరారు. 

కబ్బన్‌పార్కులో సందర్శకులు,పార్కులో పెంపుడు శునకాలతో వాకర్లు (ఫైల్‌)
వరుస ఫిర్యాదులతో నిర్ణయం  
 నియమాలను ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తామని తెలిపారు. కబ్బన్‌పార్కులో నెలకొంటున్న ఇబ్బందుల గురించి న్యాయవాదులు, ప్రజలు చేసిన ఫిర్యాదులను పరిగణించి శాఖ ఈ చర్యలకు సిద్ధమైంది. పార్కులోకి కుక్కల ప్రవేశాన్ని అరికట్టాలని కూడా కొందరు డిమాండ్‌ చేశారు. కొందరు హోటల్‌ యజమానులు తమతో మిగిలిపోయిన ఆహారాన్ని కబ్బన్‌ పార్కు వద్ద ఉన్న వీధి కుక్కలకు వేసేవారు. కుక్కలు తినగా మిగిలిన ఆహారాన్ని హోటల్‌ యజమానులే శుభ్రం చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిపోయిన భోజనాన్ని వేయటానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు