డాలర్లు ఏవి స్వామీ?

4 Feb, 2016 21:19 IST|Sakshi
డాలర్లు ఏవి స్వామీ?

 రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లు లేవు
 ఏళ్ల తరబడి వెండి డాలర్లు పట్టించుకునే వారే కరువు
 కనిపించని డాలర్ విక్రయ కేంద్రం.. భక్తుల ఆవేదన

 
 సాక్షి, తిరుమల: దేశ విదేశాల్లో ధర్మప్రచారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే టీటీడీకి ధర్మప్రచారంతో ముడిపడిన శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాలతో కూడిన బంగారు, వెండి డాలర్ల విక్రయాలను విస్మరిస్తోంది. ‘‘నగదిస్తాం. శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇవ్వండి’’ అని భక్తుల విజ్ఞప్తిని టీటీడీ అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు చిత్రాలతో కూడిన వెండి, బంగారు డాలర్లను చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ధరిస్తుంటారు. ఇది ధర్మప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది.
 
 5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.100 నుంచి రూ.250 లోపే ఉండటంతో తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భ క్తులు కొనుగోలు చేస్తుంటారు. మూడేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీనిపై భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లేవు
 బంగారు డాలర్లు విక్రయించే కౌంటర్‌లో రెండేళ్లుగా రెండు గ్రాముల డాలర్లు స్టాకు లేదు. సంబంధిత ఆలయ విభాగం అధికారులుగాని, తిరుపతిలోని జువెలరీ విభాగం గాని తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెబుతోంది. డాలర్ల కొనుగోలు వ్యవహారాలను టీటీడీ మార్కెటింగ్ విభాగానికి అప్పగించినా ఫలితం కనిపించటం లేదు. ప్రస్తుతం 10 గ్రాములు రూ.26,260, 5 గ్రాములు రూ.13,345 బంగారు డాలర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. వీటిలో తక్కువ ధర కలిగిన సుమారు రూ.5,400 ధర కలిగిన 2 గ్రాముల బంగారు డాలర్లకే భక్తుల నుంచి రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంది. ఏటీఎం కార్డుల ద్వారా కొనుగోలు చేసే భక్తులకు 2.25శాతం సర్వీసు ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు.
 
 కనిపించని డాలర్ల విక్రయ కేంద్రం
 గతంలో ఆలయం ముందే డాలర్ల విక్రయం కేంద్రం ఉండేది. అందువల్ల శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు గుర్తుగా డాలర్లు కొనుగోలుచేసే వారు. రెండేళ్లుగా దాన్ని లడ్డూ కేంద్రానికి మార్పు చేయడంతో సరిగ్గా కనిపించటం లేదు. ఈ విషయంపైనా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు