మహిళలపై దాడులను ఉపేక్షించొద్దు : విశాలాక్షి

3 Aug, 2013 03:34 IST|Sakshi
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: మహిళలపై దాడుల ను ఉపేక్షించొద్దని తమిళనాడు రాష్ర్ట మహిళా కమిషన్ చైర్మన్ విశాలాక్షి నెడుంజయన్ అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి మహిళా కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై తిరువళ్లూరు కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ వీరరాఘవరావు, విశాలాక్షి నెడుంజయన్ హాజరయ్యారు. విశాలాక్షి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై యాసిడ్ దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 
 
 ఆయా జిల్లాలో మహిళా సంక్షేమ శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. తిరువళ్లూరు జిల్లా నుంచి 17 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ఏడింటిని పరిష్కరించామని తెలిపారు. మరో మూడింటిని పొరుగు జిల్లాలకు బదిలీ చేసినట్లు వివరించారు. మిగిలిన ఏడు ఫిర్యాదులపై సంబంధిత వ్యక్తులను వివరణ కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రూత్‌వెన్నెల, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 స్పృహతప్పి పడిపోయిన చైర్మన్
 సమీక్ష ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో చైర్మన్ విశాలాక్షి స్పృహతప్పి కింద పడిపోయారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బీపీ లెవల్ తక్కువగా ఉండడంతోనే ఆమె స్పృహ తప్పారని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం విశాలాక్షి చెన్నై వెళ్లారు.
 
>
మరిన్ని వార్తలు