నేడు అంబేద్కర్ మహాపరినిర్వాణ్

6 Dec, 2013 00:21 IST|Sakshi

 సాక్షి, ముంబై: రాజ్యాంగశిల్పి డాక్టర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్‌కు సంబంధించి నగరపాలక సంస్థ (బీఎంసీ) సకల ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు రాష్ర్టంలోని అన్నిప్రాంతాలకు చెందిన ఆయన అభిమానులు శుక్రవారం దాదర్‌లోని చైత్యభూమికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వారు అసౌకర్యానికి గురికాకుండా అక్కడికి సమీపంలోని శివాజీ పార్కును అన్నివిధాలుగా సిద్ధం చేసింది. అదేవిధంగా పెద్దసంఖ్యలో తరలిరానున్న భీం సైనికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు నగర పోలీసుశాఖ కూడా అన్ని ఏర్పాట్లుచేసింది. ఎటువ ంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించింది. అక్కడక్కడా సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చింది. ఇదిలాఉంచితే లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు బీఎంసీ పరిపాలనా విభాగం సకల సదుపాయాలు కల్పిం చింది.
 
 వారికోసం సమీపంలోని  సముద్ర తీరంవద్ద తాత్కాలిక స్నానాల గదులు, సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. అన్నదానం, అల్పాహారాలను పంపిణీచేసే స్వయం సేవాసంస్థల సౌకర్యార్థం అక్కడక్కడా ప్రత్యేక వేదికల్ని ఏర్పాటు చేసింది. తాగునీరు, వైద్య సేవలు అందించేందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకున్నవారు చలి బారినపడకుండా శివాజీపార్కు మైదానంలో టెంట్లతోపాటు వాటిచుట్టూ పరదాలు ఏర్పాటు చేసింది. వంట చేసుకునే వారికి మైదానంలో ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించింది. మైదానంలో విద్యుద్దీపాలు, ఫ్లడ్‌లైట్లను అమర్చింది. ఎవరైనా పొరపాటున తప్పిపోతే వివరాలను వెల్లడించేం దుకు మైక్‌సెట్‌ను అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు తదితర సదుపాయాలు సమకూర్చింది. అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలు, క్యాలెం డర్లు, క్యాప్‌లు, బ్యాడ్జీలు, లాకెట్లు, ఆయన జీవితచరిత్ర పుస్తకాలు తదితరాలను విక్రయించేందుకు అవసరమైన స్టాళ్లకు స్థలం సమకూర్చింది.  
 
 చకచకా బ్యానర్ల తొలగింపు
 మహాపరినిర్వాణ్ దినోత్సవం సందర్భంగా భారీగా తరలివచ్చే భీం సైనికులకు స్వాగతం పలికేందుకు వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా నగరంలో పెద్దసంఖ్యలో బ్యానర్లను ఏర్పాటు చేశాయి. దాదర్ రైల్వేస్టేషన్ నుంచి చైత్యభూమి మార్గంలోని వచ్చే రహదారులపై ఎక్కడచూసినా ఇవే దర్శనమిచ్చాయి. వీటిని వెంటనే తొలగించాలంటూ బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని పరిపాలన విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించారు.  
 
 భారీ పోలీసు బందోబస్త్తు
 లక్షలాదిగా తరలివచ్చే భీంసైనికులకు రక్షణ కల్పించేందుకు నగర పోలీసు శాఖ నడుం బిగించింది. ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, ఇద్దరు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, 34 మంది ఇన్‌స్పెక్టర్లు, 39 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 533 కానిస్టేబుళ్లు, 44 మహిళా కానిస్టేబుళ్లు, ఎస్‌ఆర్‌పీఎఫ్ నాలుగు బెటాలియన్లు, రెండు బాంబు నిర్వీర్య బృందాలు, మఫ్టీలో వంద మంది పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తారు. అక్కడక్కడా తాత్కాలిక వాచ్ టవర్లను ఏర్పాటుచేశారు.  ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడే ఆకతాయిలతోపాటు చిల్లర దొంగలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా కొందరు పోలీసు అధికారులను నియమించారు.
 
 కొన్నిప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిషేధం
 అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శివాజీపార్కు, చైత్యభూమి, దాదర్ తదితర పరిసరాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా దాదర్, మహీం, సైన్, ధారావి, కరీరోడ్, వర్లీ సీఫేస్, వర్లీ కోలివాడ, సంగం నగర్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసి ఉంచాలని నగర కలెక్టర్ ఆదేశించారు. నియమాలను ఉల్లంఘించే మద్యం షాపుల లెసైన్స్ రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
 
 సేవకు ముందుకు
 అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు చైత్యభూమికి వచ్చే అభిమానులకు మార్గదర్శనం చేసేందుకు అనేక స్వయం సేవా సంస్థలు, వివిధ అంబేద్కర్ సంఘాలు కూడా ముందుకు వచ్చాయి. దాదర్‌లో దూరప్రాంతాల, లోకల్ రైలు దిగిన అభిమానులకు శివాజీపార్కు మైదానానికి ఎలా వెళ్లాలి? క్యూ ఎక్కడి నుంచి కట్టాలి, చైత్య భూమి, స్టాళ్లు ఎక్కడున్నాయి? తదిరాలపై మార్గదర్శనం చేసేందుకు వేలాదిమంది సిద్ధంగా ఉన్నారు. వారు బసచేసిన చోట అపశృతులు చోటుచేసుకోకుండా నిఘావేశారు. మరికొన్ని సంస్థలు వారికి ఉచిత భోజనం, అల్పహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి.
 

మరిన్ని వార్తలు