ఒట్టిపోయిన ఆశలు

16 Mar, 2016 01:43 IST|Sakshi

జలాశయాల్లో అడుగంటిన నీరు
మృత్యువాత పడుతున్న జలచరాలు
ఉరుముతున్న నీటి ఎద్దడి
 

బెంగళూరు: రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరీజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. ఈసారి వేసవిలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆయా నదుల్లో నీటి మట్టం తగ్గిపోతుండటంతో అందులోని జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలో జలాశయాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగు నీరు అందుతుండేది. పరిశ్రమల అవసరాలకు ఈ నీరే శరణ్యం. అయితే రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లలోనూ (ఖరీఫ్, రబీ) తక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండాఅంతకు ముందు రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహనం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి.

కావేరి నదీతీరంలోని కేఆర్‌ఎస్, హారంగి, హేమావతి, కబిని జలాశయాల్లో ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 38.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. బెంగళూరుకు తాగునీటిని అందించే  కే.ఆర్.ఎస్‌లో ప్రస్తుతం 10.88 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే నీటి పరిమాణం సగాని కంటే తక్కువ. ఉత్తర కర్ణాటక ప్రాంతంల్లోని జిల్లాలకు తాగు,సాగు నీటిని అందించే కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, ఆల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో గత ఏడాది ఈ సమయానికి 119.77 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 64.41 టీఎంసీలకు పడిపోయింది. వీటిలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ భాగాలకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం మరీ ఘోరం. ఈ డ్యాంలో ప్రస్తుతం 7.40 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి తుంగభద్ర డ్యాంలో 18.52 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం.
 గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 98 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది 137 తాలూకాల్లో కరువు తాండవిస్తోంది. ఈ విషయమై రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ...‘జలాశయాల్లో నీరు లేక పోవడం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తాగు నీటిని అందించడమే గగనమవుతోంది. అందువల్లే రబీ పంటల కోసం కాలువలకు నీటి విడుదలను ఇప్పటికే నిలిపివేశాం. పరిశ్రమల అవసరాలకు నీటిని ఇవ్వకూడదని కూడా సంబంధితఅధికారులకు సూచించాం. అయినా ప్రజల దాహార్తిని తీరుస్తామని చెప్పలేం. వర్షం కోసం దేవుడిని ప్రార్థించాల్సిందే.’ అని పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు