డీయూ కళాశాలల్లో ప్రవేశాలు మళ్లీ మొదలు

2 Jul, 2014 05:09 IST|Sakshi
డీయూ కళాశాలల్లో ప్రవేశాలు మళ్లీ మొదలు

 సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని కళాశాలల ప్రాంగణాలు మంగళవారం కళకళలాడాయి. తొలి కటాఫ్ జాబితాను సోమవారం రాత్రి ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఉదయం నుంచే కళాశాలల వద్దకు చేరుకున్నారు.  దీంతో డీయూలోని ఉత్తర, దక్షిణ ప్రాంగణాలు కిటకిటలాడాయి. అన్ని కళాశాలల్లోనూ బీకామ్, ఎకనామిక్స్ ఆనర్స్, కంప్యూటర్‌సైన్స్  కోర్సులకు పోటీ ఎక్కువగా ఉంది. 100 శాతం మార్కులు ఉంటే గానీ కంప్యూటర్‌సైన్స్ (ఆనర్స్)లో ప్రవేశం సాధ్యం కాదంటూ ఆత్మారామ్ సనాతన్ ధర్మ,ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలు ప్రకటించాయి. ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలో సాధారణ కేటగిరీలోనే కాకుండా వికలాంగ విద్యార్థులకు కూడా కటాఫ్ మార్క్ 100 శాతంగానే ఉంది.
 
 డీయూ క్యాంపస్ కళాశాలల్లో 100 శాతం కటాఫ్ గతంలో రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులకు అనుభవంలోకి వచ్చింది, అయితే క్యాంపస్ వెలుపలి కళాశాలల్లో కటాఫ్ మార్క్ 100 శాతంగా ఉండడం ఇదే మొదటిసారి.మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా ఈ నెల మూడో తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయి. తొలి కటాఫ్ జాబితాలో ప్రవేశం లభించనిరాని వారు నిరాశకు గురికానవ సరం లేదు. ఈ ఏడాది మొత్తం ఎనిమిది టాఫ్ జాబితాలను విడుదల చేయనున్నట్లు డీయూ ప్రకటించింది. కాగా  కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా విద్యార్థులు ప్రవేశాల కోసం డీయూకి వచ్చారు. అయితే తగిన వసతి లేకపోవడంతో వారంతా నానాయాతనకు గురయ్యారు.
 
 ఇక ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లలకు ప్రవేశాలకోసం వచ్చిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరి కొన్ని రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. విధులకు మళ్లీ హాజరు కావాల్సి ఉండడం, ఇతర పనులు ఉండడం, తమ పిల్లలకు ప్రవేశం ఏమవుతుందనే ఆందోళనతో వారు గందరగోళానికి గురవుతున్నా రు.
 
 ఈ విషయమై బహ్రెయిన్ నుంచి నగరానికి వచ్చిన నైనికా దినేశ్ మాట్లాడుతూ ‘జూన్ 24వ తేదీనే ప్రవేశాలు ఉంటాయనే ఆశతో ఇక్కడికి వచ్చా. అయితే మధ్యలో నెలకొన్న పరిణామాల కారణంగా ఇక్కడే ఉండక తప్పలేదు’ అన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బెంగళూర్ నుంచి నగరానికి వచ్చిన కుల్వంత్ కిన్హా మాట్లాడుతూ ‘ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవడంతో హోటల్‌లో బస చేయా ల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు మొదలవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది. మా నాన్న కూడా నా వెంబడి వచ్చాడు. ఆయన ఉద్యోగి. విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. వాస్తవానికి మేమిద్దరం ఇక్కడే వారం రోజులపాటు ఉండాల్సి వస్తుందనుకోలేదు’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 కటాఫ్‌పై విద్యార్థుల ఆందోళన
 న్యూఢిల్లీ: కటాఫ్ మార్కులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢి ల్లీ విశ్వవిద్యాలయంలోని ఉత్తర ప్రాంగణంలోగల ఆర్ట్ ఫ్యాకల్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ‘కటాఫ్ తగ్గించండి-సీట్ల సంఖ్య తగ్గించండి’ అంటూ నినదించారు. కాగా డీయూ లో మొత్తం 54 వేల సీట్లు ఉండగా, దాదాపు 2.7 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడంతో వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో ప్రవేశం లభించలేదు. ఇటువంటి వారందరూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో చేరడమే తప్ప మరో మార్గం లేదు.
 

మరిన్ని వార్తలు