నిర్మాణ నిబంధనలు మరింత సరళతరం

30 Dec, 2014 22:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. భవన నిర్మాణ ప్లాన్లకు ఆమోదం ఇక సులభతరంగా మారింది. ఇందుకు కారణం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు 1983నాటి బిల్డింగ్ బె లాస్‌ను సరళీకరించి, క్రమబద్ధీకరించడంతో పాటు నవీకరించడమే. ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ)  డీడీఏ, మున్సిపల్ సంస్థలతో కలిసి బైలాస్‌ను సరళీకరించి, సరళీకృత  బైలాస్ ముసాయిదాను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సమర్పించింది. బిల్డింగ్ బైలాస్‌ను వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఢిల్లీ అభివృద్థి సంస్థను ఆదేశించారు. తాజా బైలాస్ ప్రకారం 100 చదరపు మీటర్ల వరకు ఉండే చిన్న సైజు నివాస ప్లాట్ల అనుమతి ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది.
 
 ఈ ప్లాట్లలో భవనం నిర్మించే వారు అవసరమైన సమాచారాన్ని ఒక పేజీలో పొందుపరచి సంబంధిత పట్టణ సంస్థకు సమర్పించి నిర్మాణం జరుపుకోవచ్చు. ఇది మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. 100 నుంచి 20 వేల చదరపు మీటర్ల వరకు ఉండే ప్లాట్లు సంబంధిత సంస్థల నుంచి ఆమోదం పొందడం కోసం నిర్దిష్ట సమయాన్ని నిర్ధారించారు. 20  వేల చదరపు మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉండే ప్లాట్ల అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ప్రతిపాదించారు. అనుమతుల మంజూరు కోసం సంబంధిత సంస్థల ప్రతినిధులతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ  దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఢిల్లీవాసులు, వృత్తినిపుణులు అత్యంత సులువుగా తమ భవనాల ప్లాన్లకు ఆమోదం పొందే వీలును తాజాగా రూపొందించిన బిల్డింగ్ బైలాస్ కల్పించాయి. హరిత నిర్మాణాలు, ఇంకా జల సంరక్షణ, యాజమాన్యం వంటి తదితర సవాళ్లను కొత్త నిబంధనలు పరిష్కరించనున్నాయి.
 

మరిన్ని వార్తలు