అనువాద సీరియళ్లను ఆపేయాలి

16 Apr, 2015 03:37 IST|Sakshi
అనువాద సీరియళ్లను ఆపేయాలి

తమిళసినిమా: తమిళేతర భాషా టీవీ సీరియళ్ల ప్రచారాలను నిలిపి వేయాలంటూ బుల్లితెర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం బుధవారం షూటింగ్‌లను రద్దుచేసి చానళ్ల నిర్వాహకులకు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల పనిలేక ఆర్థిక సమస్యలతో బుల్లితెర దర్శకుడు బాలాజి యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలం నుంచి బుల్లితెర కళాకారుల సంఘం అనువాద సీరియళ్ల ప్రచారాన్ని వ్యతిరేకిస్తోంది. అనువాద సీరియళ్ల కారణంగా బుల్లితెర కళాకారులకు పని లేకుండా పోతోందని, చాలామంది ఆర్థిక సమస్యలకు గురవుతున్నారని టీవీ చానళ్ల యాజమాన్యానికి తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అయితే వారు అనువాద సీరియళ్లను ప్రచారం చేస్తూ బుల్లితెర కళాకారుల గోడును పట్టించుకోకపోవడంతో బుధవారం బుల్లితెర నటీనటులు ఆధ్వర్యంలో ఒక రోజు షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమాఖ్యకు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య మద్దతు పలికింది. ఈ సందర్భంగా బుల్లితెర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల కార్యాలయంలో సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నటి రాధిక, నళిని, పెప్సీ అధ్యక్షుడు శివ, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, త్యాగరాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు బుల్లితెర నటీనటుల సమాఖ్య టీవీ చానళ్ల కార్యాలయాలకు వెల్లి అనువాద సీరియళ్ల ప్రచారాలను నిలిపి వేయాల్సిందిగా వినతి పత్రాన్ని అందించాలని తీర్మానించింది.

మరిన్ని వార్తలు