కుటుంబ కలహాలే కారణం

3 Mar, 2014 23:16 IST|Sakshi

 న్యూఢిల్లీ: గూఢచార సంస్థ రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) అధికారి అనన్య చక్రవర్తి ఇటీవల భార్యాపిల్లలను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. దక్షిణఢిల్లీలోని తన స్వగృహంలోనే ఆయన శనివారం ఈ దారుణానికి పాల్పడ్డారు. భార్య జయశ్రీ (42), సంతానం దిశ (12), అర్ణబ్ (17)ను చంపి తాను ఉరి వేసుకున్నారు. భార్యాపిల్లల మృతదేహాలపై తీవ్రగాయాలు కనిపించాయి. వారిని తీవ్రంగా హింసించి చంపినట్టు తేలింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. పొరుగువాళ్లు, నౌకర్లు, అపార్టుమెంట్ వాచ్‌మన్‌ను ప్రశ్నిం చారు. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడల్లా పిల్లలిద్దరూ తల్లికి మద్దతు ఇచ్చేవారని వెల్లడయింది. అయితే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎవరూ భోజనం చేయకపోవడంతో సగం ఉడికిన ఆహారం వంటగదిలో కనిపించింది.
 
  చక్రవర్తి కుటుంబం స్థానికంగా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగేది. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నా.. గొడవల గురించి ఎప్పుడూ ప్రస్తావించేవాళ్లు కాదని పొరుగువాళ్లు చెబుతున్నారు. వీళ్లంతా ఏ సమయంలో మృతి చెందారనే విషయం ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రక్తంతో తడిన సుత్తి, పెద్ద కత్తిని ఘటనాస్థలంలో కనిపించిందని, వీటితోనే చక్రవర్తి హత్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అపరిచితులు లోపలికి బలవంతంగా ప్రవేశించినట్టు నిరూపించే ఆధారాలు కూడా లభించకపోవడంతో చక్రవర్తే ఈ హత్యలు చేసినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఈ అధికారికి ఢిల్లీలో దగ్గరి బంధువులు ఎవరూ లేరు.
 
 ఇద్దరు అక్కలు ఉన్నా వాళ్లు ఇతర నగరాల్లో నివసిస్తున్నారు. రాలో ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారి అయిన చక్రవర్తి కేబినెట్ సెక్రటేరియెట్‌లో పనిచేసేవాడు. ఘటనాస్థలంలో లభిం చిన ఆధారాలన్నింటినీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించామని, దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ అధికారి ఆత్మహత్య నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు