అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు

13 Dec, 2014 22:26 IST|Sakshi

షోలాపూర్ న్యూస్‌లైన్: అకాల వర్షాలు రబీ పంటకు చేటు చేశాయి. దీంతో రైతాంగానికి ఏమీపాలుపోని పరిస్థితి తలెత్తింది. మరోవైపు మరోవారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంటుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టణంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యమధ్యలో కొంత విశ్రాంతి ఇచ్చినప్పటికీ  రోజంతా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంతోపాటు కారుమాల, సాంగోలా, మాళశిరస్, అకులుజ్, మాఢా, పండరీపూర్, మోహల్, బార్షీ, అక్కల్‌కోట్, దక్షిణ, ఉత్తర షోలాపూర్ తదితర తాలూకాలపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది.

మరోవైపు ఈ కారణంగా జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది.  మొక్కజొన్న, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే అక్కల్‌కోట్, తుల్జాపూర్ తాలూకాలలోని నీటి ఎద్దడి ప్రాంతాల్లోని పంటలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే ఈసారి జిల్లాల్లో దిగుబడి మాత్రం తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  
 
ముంబైలో భారీవర్షం: ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి మబ్బులు కనిపించకపోయినప్పటికీ తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురి సింది. ముంబైతోపాటు నవీ ముంబై, ఠాణేలలో దీని ప్రభావం కనిపించింది.

>
మరిన్ని వార్తలు