సందడే సందడి

13 Oct, 2013 02:10 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ:దసరా కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది దసరా, బక్రీద్ పండుగలు కలిసి రావడంతో కొనుగోళ్లు మరికాస్త పెరిగాయి. నగరంలోని ప్రధాన మార్కెట్లయిన సరోజినీ నగర్, కరోల్‌బాగ్, పాలికాబజార్, కన్నాట్‌ప్లేస్, చాందినీ చౌక్, సదర్ బజార్‌లలో రద్దీ బాగా పెరిగింది. రాంలీలాతో రాత్రి వేళల్లో సందడి వాతావరణం నెలకొంటోంది. వారం రోజులుగా ప్రదర్శిస్తున్న రాంలీలా వద్ద ప్రేక్షకుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దసరా పండుగకు వివిధ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. 
 
 వార్తా పత్రికల్లో, టీవీల్లో విరివిగా వస్తున్న ప్రకటనలతో వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు తదితరాలను స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. పండుగ సమీపించడంతో దుకాణాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని సరోజినీ మార్కెట్‌లోని ఆభరణాల దుకాణం యజమాని సంజయ్ తెలిపారు. ఈ ఏడాది ఎక్కువమంది ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. మొబైల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూట ర్లు తదితర వస్తువులు బాగా అమ్ముడవుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా స్నేహితులు, బంధువులకు బహుమతులు పంపేవారి సంఖ్య ఈ  ఏడాది ఎక్కువగానే ఉంది.
 
 రాంలీలాలో బాలీవుడ్ తారల సందడి 
 రాజధాని నగరంలో దసరా వేడుకలు అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది రాంలీలా ప్రదర్శనలు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ఏడాది నగరంలోని పలు చోట్ల భారీ స్థాయిలో రాంలీలాలు ఏర్పాటు చేశారు. వరుణుడు కాస్త ఆటంకం కలిగించినా నగరవాసులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా రాంలీలాకు తరలివెళుతున్నారు. కొన్ని చోట్ల రాంలీలా ప్రదర్శనల్లో బాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు .రోహిణి సెక్టార్-3, మంగోలిపురిలోని కళా మైదానంలో ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాల్లో గుల్షన్ గ్రోవర్, అఫ్తాబ్‌శివ్‌దాసానీ, రవీనాటాండన్, మహిమా చౌదరిలతోపాటు ప్రముఖ గాయకుడు శంకర్‌సహానీ పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు 70 ఎంఎం తెరపైన రామాయణ ధారావాహికను ప్రదర్శిస్తున్నారు. వర్షం కారణంగా సీబీడీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న రాంలీలా వేదిక చుట్టుపక్కల నిలిచిన నీటిని కమిటీ సభ్యులు మోటార్లతో తోడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాంలీలాకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడం నిర్వాహకులకు ఆనందం కలిగిస్తోంది.
 
 కళకళలాడుతున్న ఆలయాలు  
 తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజలతో నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ ఉదయం పూల అలంకరణలు, రాత్రి వేళల్లో విద్యుద్దీప కాంతులతో ప్రత్యేక శోభను సంతరించుకుంటున్నాయి. ఝండేవాలామందిర్, కల్కాజీ మందిర్, చత్తర్‌పూర్ మందిర్, గౌరీశంకర్ మందిర్‌తోపాటు బెంగాలీలు ఎక్కువసంఖ్యలో చిత్తరంజన్‌పార్క్ ప్రాంతాల్లో ప్రతి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అమ్మవారికోసం తయారు చేసిన ప్రత్యేక ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. నవరాత్రులు ఉపవాసాలతో ఏ ఇంట్లో చూసినా పండుగ శోభ కనిపిస్తోంది. 
 
 నిఘా నీడలో నగరం: 
 ఒకేసారి  రెండు పండుగలు రావడంతో అన్ని ప్రధాన మార్కెట్లు, ఆలయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు ఎలాంటి దాడులకు తెగబడకుండా భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. ప్రతి చోటా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రధాన ఆలయాలన్నింటికీ భద్రత పెంచారు. ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతోపాటు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
 
 మహిళా శక్తిని ఆవిష్కరించిన దేవతామూర్తుల చిత్రాలు
 మహిళలకు స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చేవిధంగా అమ్మవార్ల చిత్రాలను ప్రదర్శించినట్లు ఎగ్జిబిషన్ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి దోగ్రా తెలిపారు. నగరంలోని చాణక్యపురిలో ఉన్న ఆర్ట్ ఇండస్ గ్యాలరీలో శుక్రవారం ‘దేవి దేవి’ పేరిట దేవతా మూర్తుల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ‘దేవతా మూర్తుల శక్తివంతమైన రూపాలను చిత్రీకరించడం ద్వారా మన మధ్య నివసిస్తున్న శక్తిస్వరూపుణులైన మహిళలకు నివాళులర్పిస్తున్నాం..’ అని చిత్రకారిణులు అర్పణ కౌర్, సీమా కోహ్లీ, షిప్రా భట్టాచార్య, జయశ్రీ బర్మన్, గోసి సరోజ్‌పాల్ తదితరులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 24వ తేదీవరకు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన సింహవాహనంపై దుర్గామాత, ధ్యానముద్రలో ఉన్న పార్వతీ దేవి, పరమేశ్వరుడి తలపై నుంచి ఉరకలెత్తుతున్న గంగాదేవి వంటి చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
 
 ‘సేవా’ ఆధ్వర్యంలో నేడు దసరా వేడుకలు
 సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి వేడుకలను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి  నిర్వహించనున్నట్టు సమైక్య తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (సేవా) ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్.మురళి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కమ్యూనిటీ పార్కు, బ్లాక్ నంబర్ 43-48, గోల్ మార్కెట్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదట విఘ్నేశ్వర ప్రార్థన, లలితా పారాయణం, భక్తిగీతాలాపన, శ్రీ దుర్గామాత భజన, ప్రముఖ భక్తి పాటల గాయకుడు ఆసా ్తచానల్ ఫేం జస్బీర్‌సింగ్‌లఖా బృందంతో భక్తిపాటల ఆలాపన, వివిధ దేవుళ్ల అవతార ప్రదర్శన, అనంతరం రావణ దహనం, ప్రసాదం పంపిణీ తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
 
మరిన్ని వార్తలు