విద్యార్థులకు ఈ-లెర్నింగ్ టాబ్స్

16 Jul, 2015 08:24 IST|Sakshi
విద్యార్థులకు ఈ-లెర్నింగ్ టాబ్స్

- వచ్చే ఏడాది నుంచి అందజేస్తామన్న యువసేన అధ్యక్షుడు ఆదిత్య
- పల్లె ప్రాంతాల్లో సోలార్ ట్యాబ్‌లెట్ల పంపిణీ
- ఎన్నికల హామీ నెరవేర్చేందుకేనని వెల్లడి

ముంబై:
వచ్చే ఏడాది నుంచి విద్యార్థుకు ట్యాబ్‌లెట్లు అందజేస్తామని శివసేన అనుబంధ యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే బుధవారం తెలిపారు. విద్యార్థులు బ్యాగ్‌లు భారం తగ్గిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ‘ఈ-లర్నింగ్’ ట్యాబ్‌లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఈ-లర్నింగ్ ట్యాబ్‌లు అందజేసే ప్రక్రియలో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. బుధవారం విధానసభకు వచ్చిన ఆదిత్య, విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి వినోద్ తావడేకు ఒక ట్యాబ్ అందజేశారు. ‘ఇటీవల దాదర్‌లోని బాల్‌మోహన్ విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు ఈ-లర్నింగ్ ట్యాబ్‌లు అందజేశారు. దీంతో వారికి పుస్తకాలు మోసే బాధ తప్పింది. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ట్యాబ్ లు అందజేస్తాం. అందులో మొత్తం తరగతి సిలబస్, మ్యాపులు, గ్రాఫిక్‌తో కూడిన సమాచారం, పరీక్షలు వంటి మరిన్ని అందుబాటులో ఉంటాయి. బీఎంసీ పాఠశాలల్లో బోధించే అన్ని భాషలు అందులో నిక్షిప్తం అయ్యి ఉంటాయి’ అని ఆదిత్య తెలిపారు.
 
కమిటీ నివేదిక వచ్చిన వెంటనే..
ప్రస్తుతం సర్వే చేస్తున్న కమిటీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే రాష్ట్రంలోని జిల్లా పరిషత్, స్థానిక సంస్థల పాఠశాలల్లోనూ ట్యాబ్లెట్ల పంపిణీ చేపడతామని చెప్పారు. సోలార్‌పవర్‌తో చార్జింగ్ అయ్యే ట్యాబ్‌లు పల్లె ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. బీఎంసీ పాఠశాలల్లో సేన మార్పులు చేసినప్పటినుంచి అక్కడ 90 శాతం ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆదిత్య నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, విద్యార్థులకు శ్రమ తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని విద్యా శాఖ మంత్రి వినోద్ తావడే తెలిపారు.

మరిన్ని వార్తలు