లభించని ఈ–పాస్‌.. సరిహద్దులోనే వివాహం

18 Jun, 2020 08:30 IST|Sakshi
వధూవరులు అరవింద్, ప్రశాంతి

చెన్నై, టీ.నగర్‌: ఈ–పాస్‌ లభించకపోవడంతో కేరళ సరిహద్దులో మంగళవారం శంకరన్‌ కోవిల్‌కు చెందిన ఇంజినీర్‌కు వివాహం జరిగింది. కరోనా వైరస్‌ కారణంగా తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల మధ్య రవాణ సౌకర్యాలు నిలిపివేశారు. అత్యవసర పనులకు మాత్రమే ప్రభుత్వం ఈ–పాస్‌లు అందిస్తోంది. ఇది వరకే శంకరన్‌ కోవిల్, వెంకటాచలపురం ఉత్తర వీధికి చెందిన అరవింద్‌ (29)కు కేరళ రాష్ట్రం పత్తనందిట్ట జిల్లాకు చెందిన ప్రశాంతి (23)తో వివాహం నిశ్చయమైంది. వివాహం రోజు సమీపించగా వారికి ఈ–పాస్‌ లభించలేదు. ఈ క్రమంలో కేరళలో ఉన్న వధువు, శంకరన్‌ కోవిల్‌లో ఉన్న వరుడు కేరళ సరిహద్దు అయిన అరియంగావు చెక్‌పోస్టు సమీపంలోకి బంధువులతో సహా మంగళవారం చేరుకున్నారు. వీరంతా ముఖాలకు మాస్కులు ధరించారు. అక్కడున్న నారాయణగురు మంత్రం అనే ప్రాంతంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహ కార్యకమానికి తక్కువ సంఖ్యలో కుటుంబీకులు, బంధువులు హాజరై వధూవరులకు ఆశీస్సులందించారు. ఆ తరువాత అధికారుల సాయంతో వధూవరులు ఇరువురు శంకరన్‌ కోవిల్‌ బయలుదేరారు. 

మరిన్ని వార్తలు