ఉత్కంఠగా..

9 Apr, 2017 03:19 IST|Sakshi
ఉత్కంఠగా..

ఉప ఎన్నిక రద్దయ్యేనా..?
♦  ఢిల్లీకి ఎన్నికల అధికారులు
రూ.89 కోట్ల నగదు బట్వాడా
♦  ఆధారాల చిట్టా లభ్యంతో చర్చ
టీటీవీకి వ్యతిరేకంగా చిట్టాలో వివరాలు
♦  అమ్మ, పురట్చితలైవి శిబిరాలపై ఈసీ అసంతృప్తి


ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక రద్దయ్యేనా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు శనివారం చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గంలో రూ.89 కోట్ల మేరకు నగదు బట్వాడా సాగినట్టుగా ఆదాయపన్ను శాఖ ఓ జాబితాను ఎన్నికల యంత్రాంగానికి సమర్పించింది. అదే సమయంలో ఎన్నికల అధికారులు ఢిల్లీ వెళ్లడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే అమ్మ, పురట్చితలైవి శిబిరాలపై ఈసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో ఈనెల 12న ఉప ఎన్నిక జరగనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రచారంలో నేతలు దూసుకెళుతున్నారు. అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్, పురట్చితలైవి అభ్యర్థి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీప అన్నాడీఎంకే ఓట్లను చీల్చుకునే దిశగా పరుగులు తీస్తున్నారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్‌కు మద్దతుగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తీవ్ర ప్రచారంలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి గంగైఅమరన్‌ ప్రచారంలో దూసుకెళ్తుండగా, తన అభ్యర్థి మధివానన్‌కు మద్దతుగా ఆదివారం నాలుగున్నర గంటల పాటు సుడిగాలి పర్యటనకు డీఎండీకే అధినేత విజయకాంత్‌ సిద్ధమయ్యారు. అదే సమయంలో  నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్‌ అధికార, ధన బలం ప్రయోగంతో తీవ్ర వ్యూహ రచనలు సాగిస్తున్నట్టు ఆరోపణలు వసు ్తన్నాయి. నియోజకవర్గంలో ఓటుకు కొన్ని చోట్ల రూ.నాలుగు వేలు, మరికొన్ని చోట్ల రూ.ఏడు వేలు ఇస్తున్నట్టుగా ఆరోపణలు హోరెత్తుతున్నాయి.

ఉత్కంఠగా: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు, ప్రచారాలు ఓ వైపు సాగుతుంటే మరోవైపు ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదోనన్న సర్వేలు సైతం సాగాయి. డీఎంకే అభ్యర్థి గెలుపు ఖాయం అన్నట్టు లయోల కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది అన్నాడీఎంకే ఓట్ల చీలిక డీఎంకేకు కలిసి వచ్చే అంశంగా ఆ సర్వే తేటతెల్లం చేసింది. డీఎంకే గెలుపు ఖాయం అని 49 శాతం మద్దతు పలికినట్టు ఆ విద్యార్థులు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక సాగేనా అన్న ఉత్కంఠ బయలు దేరింది.

ఇందుకు నగదు బట్వాడా కారణం, శనివారం కూడా అధికారులు రూ. 29 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో రూ.89 కోట్ల మేరకు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నగదు పంపిణీ చేయాలి, ఎవరెవ్వరి ద్వారా పంపిణీ జరగాలని, నేతృత్వం వహించే వారెవ్వరో అన్న వివరాలతో జాబితా బయటపడడం గమనార్హం. ఆదాయ పన్ను శాఖ శుక్రవారం జరిపిన దాడుల్లో ఈ జాబితా వెలుగులోకి వచ్చింది.

ఇందులో సీఎం ఎడపాడి పళనిస్వామితో పాటు పలువురు మంత్రుల పేర్లు ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలోని ఏడు వార్డుల్లో ఏ వార్డుకు ఎంత మొత్తం కేటాయించారో, వాటిని స్వీకరించిన వారి పేర్లతో సహా వివరించి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. ఈ నగదు ఎలక్ట్రిక్‌ రైలు మార్గాన్ని ఆధారంగా చేసుకుని తరలించినట్టు సమాచారం. ఇక,  రెండాకుల చిహ్నంను సీజ్‌ చేసినా ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి తమకు అనుకూలంగా దానిని వాడుకుంటున్నట్టు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఇచ్చిన  వివరణ అసంతృప్తికరంగా ఉండడాన్ని ఎన్నికల యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది.

ఈ పరిణామాలు ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ రేపుతోంది.
ఎన్నికలు రద్దయ్యేనా: ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, నియోజకవర్గంలో తమకు పట్టుబడ్డ నగదు, తాయిలాల వివరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్‌బాద్రాతో పాటు పలువురు అధికారులు ఆగమేఘాలపై ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో ఎన్నికలు రద్దు అయ్యేనా, వాయిదా పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది.

నగదు బట్వాడాకు తగ్గ ఆధారాలు లభించడం, అమ్మ, పురట్చితలైవి శిబిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఉండడం వెరసి ఎన్నికల నిర్వహణ మీద ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు కేవలం నాలుగు రోజులే సమయం ఉండడం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దృష్ట్యా, రద్దు విషయంలో వెనక్కు తగ్గుతారా అన్న ఎదురుచూపులు ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవకుర్చి, తంజావూరుల్లో నగదు బట్వాడా ఆధారాలు బయట పడడంతో, ఆ రెండు చోట్ల ఎన్నికల్ని ఈసీ నిలుపుదల చేయడం గమనించాల్సిన విషయం.

 తన గెలుపును అడ్డుకునేందుకు సాగుతున్న కుట్రలో భాగమే నగదు బట్వాడా ఆరోపణలు అని అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్ని నిలుపుదల చేయడం లక్ష్యంగా బూటకపు జాబితా పేరుతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, డీఎంకే  ర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ తన ప్రచారంలో నగదు బట్వాడాపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, నగదు బట్వాడా చేసిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు.
 

>
మరిన్ని వార్తలు