సోషల్ మీడియాపై డేగ కన్ను

16 Dec, 2014 01:54 IST|Sakshi
సోషల్ మీడియాపై డేగ కన్ను

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యల  గుర్తింపే లక్ష్యం
ఇందు కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు
సుమోటోగా కేసుల నమోదు, దర్యాప్తునకు   అవకాశం
ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇది రెండోది మాత్రమే
అప్రమత్తమైన పోలీసులు

 
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతి పరుల బెదిరింపుల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో విధానసౌధ, వికాససౌధ వంటి  ప్రముఖ కట్టడాల వద్ద, చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు మాల్స్ వద్ద నిఘా పెంచారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. మరోవైపు బెదిరింపు నేపథ్యంలో మహ్దీ మద్దతుదారులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
బెంగళూరు:  ‘మెహ్దీ’ ఉదంతంతో నగర పోలీసులు మేలుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) సంస్థకు మద్దతుగా ట్విట్టర్ (సామాజిక సంబంధాల వేదిక-సోషియల్ మీడియా) ద్వారా బెంగళూరులో ఉన్న మెహ్దీ మస్‌రూర్ బిశ్వాస్ పనిచేస్తున్న విషయాన్ని ఎక్కడో ఉన్న బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 సంస్థ ప్రసారం చేసేంతవరకూ మనవాళ్లు పసిగట్టలేక పోయారు. ఈ విషయం అటు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. సమాచార సాంకేతిక రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఐటీపరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేపడుతున్న ఓ వ్యక్తి గురించి తెలుసుకోలేకపోవడం సరికాదని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులకు తలంటాయి. దీంతో మేలుకున్న రాష్ట్ర హోం శాఖ ముఖ్యంగా నగర పోలీసులు మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో తలములకలయ్యారు.

మానిటరింగ్ ల్యాబ్...

సోషియల్ మీడియా ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నుంచి సమాచారాన్ని రవాణా చేస్తున్నారన్న విషయం గమనించడం చాలా కష్టమైన పని. అంతే కాక  సోషియల్ మీడియాలో వచ్చిన ప్రతి సమాచారాన్ని విశ్లేషించడం కూడా కుదరదు. అయితే ప్రత్యేక విధానం ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషియల్ మీడియాల్లో నిర్థిష్ట విషయం అప్‌లోడ్ అయిన వెంటనే కనుగొనడానికి కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ‘సోషియల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్’ను రహస్య స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా హాకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను అనుసరించి సోషియల్ మీడియాలోని సమాచారంపై ఫిర్యాదు చేసిన సమయంలోనే, చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అయితే మానిటరింగ్ ల్యాబ్ ఉండటం వల్ల సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి అవకాశం కలుగుతుంది.

ఇప్పటి వరకూ ఇలాంటి ఏర్పాటు ముంబైలో మాత్రమే ఉంది. ‘మెహ్దీ’ ఘటన నేపథ్యంలో పోలీసులు ముంబై వెళ్లి అక్కడి విధివిధానాలను పరిశీలించి మానిటరింగ్ ల్యాబ్‌ను కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయం పై నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘ఉగ్రవాదం కొత్తపోకడలను అనుసరిస్తోంది. అందుకు అనుగుణంగా మేము కూడా మా నిఘా, దర్యాప్తు విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఒక ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం’ పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు