ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

3 Mar, 2017 03:08 IST|Sakshi
ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
  • వాయిదా పడిన ఎంసెట్, ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ
  • సర్వీసు ప్రొవైడర్‌ ఖరారు కాకపోవడమే కారణం
  • దరఖాస్తుల తేదీలను తరువాత వెల్లడిస్తామన్న సెట్‌ కమిటీలు
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందర గోళంగా మారింది. తేదీలు ముందే ప్రకటించినా సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక సమస్య కారణంగా వాటిని వాయిదా వేస్తూ వెళుతున్నారు. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఆగి పోగా.. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. కానీ అసలు నోటిఫికేషనే జారీ కాలేదు.

    గత నెల 23న జారీ అయిన ఐసెట్‌ నోటిఫి కేషన్‌కు సంబంధించి ఈ నెల 3 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పరీక్షల నిర్వ హణ తేదీలు మాత్రం యథాతథంగా ఉంటాయని ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య, ఐసెట్‌ కన్వీనర్‌ కె.ఓంప్రకాశ్‌ తెలిపారు. ఇక ఆయుష్‌ కోర్సులకు సంబంధించిన స్పష్టత కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి రాలేదని ఎంసెట్‌ కమిటీ వెల్లడించింది.

    పర్యటనలో విద్యా మండలి.. పట్టించుకోని ప్రభుత్వం
    సర్వీసు ప్రొవైడర్‌ ఎంపిక విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రెండు సెట్స్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. గత నెల 23న ఐసెట్‌ షెడ్యూల్‌ ప్రకటించినా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్‌ చైర్మన్లు ఉన్నత విద్యలో సంస్కరణల అంశంపై అధ్యయనం చేసేందుకు రాజస్థాన్‌కు వెళ్లారు. దాంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవారు లేకుండా పోయారు. వారు శుక్రవారం తిరిగి రానున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

    అసలేం జరిగింది?
    ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో సెట్స్‌ కన్వీనర్ల కమిటీ గత నెలలోనే సర్వీసు ప్రొవైడర్‌ ఎంపికకు చర్యలు చేపట్టింది. అయితే ఓపెన్‌ టెండర్లు పిలవకుండా కన్వీనర్లు తమకు తెలిసిన వారినే పిలిచి సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తున్నారంటూ కొందరు తెలంగాణ సర్వీసు ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గతేడాది తమకు అవకాశమివ్వాలని కోరినా ఇవ్వలేదని, ఈసారైనా ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని వివరణ కోరింది. ఇది పరీక్షలకు సంబంధించిన అంశమైనందున తాము పాత పద్ధతిలోనే గుర్తించిన 8 సర్వీసు ప్రొవైడర్లను పిలిచి తక్కువ రేటు కోట్‌ చేసిన వారికి పనులను అప్పగిస్తున్నట్లు పేర్కొంది.

    కొత్త వారికి అవకాశమిస్తే పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, బహిరంగ టెండర్‌కు వెళితే సమయం సరిపోదని పేర్కొంది. ఈ విషయంలో ఏం చేయాలో తేల్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక జరగక, దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది.
     

మరిన్ని వార్తలు