భక్తిశ్రద్ధలతో ఈస్టర్

5 Apr, 2015 22:52 IST|Sakshi

వివిధ చర్చిల్లో ప్రార్థనలు

పెద్దసంఖ్యలో పాల్గొన్న క్రైస్తవులు
సాయుధ బలగాలను మోహరించిన పోలీసు శాఖ
ప్రశాంతంగా వేడుకలు
 

 
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఆదివారం ఈస్టర్ వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని వివిధ చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రేమ విందు ఆరగించారు. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఈస్టర్ వేడుకలు ప్రశాంతభరిత వాతవరణంలో జరిగాయి. దీంతో ఉదయం నుంచే నగరంలోని కొన్ని చర్చిల్లో ఏర్పాటు చేసిన ఆరాధన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పోలీస్ కమిషనర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్చిల వద్ద గట్టి భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్క చర్చి వద్ద తగినంత మంది సాయధ పోలీసులను గస్తీకి పెట్టామని వెల్లడించారు. ఇటీవల కాలంలో చర్చిలపై దాడులు జరుగుతుండటంతో ప్రభుత్వం భద్రతా చర్యలకు పూనుకుందని ఫెడరేషన్ ఆఫ్ క్యాథలిక్ సెక్రటరీ ఎం.ఎస్.స్టానిస్లాస్ అన్నారు. ‘ఈస్టర్ వేడుకలకు ముందు జరిగిన పరిణామాలతో కొంతమంది ప్రతినిధులు అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీ.ఎస్.బస్సీని కలిశారు.

ఈ సందర్భంగా చర్చిల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది’ అని ఆయన చెప్పారు. కానీ స్టానిస్లాస్ వ్యాఖ్యలతో రెవ.మోహిత్ హిట్టర్ విబేధించారు. ఈ భద్రతా ఏర్పాట్లుకి అంతకుముందు చోటు చేసుకున్న సంఘటనలకు ఎలాంటి సంబందం లేదని ఢిల్లీలోని అతిపురాతన మైన చర్చిల్లో ఒకటైన సెయింట్ జేమ్స్ చర్చికి చెందిన మోహిత్ హిట్టర్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ, ‘ప్రతి సంవత్సరం కూడా క్రిస్ట్‌మస్, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సందర్భాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘అంతకు ముందు చర్చిల వద్ద భద్రత ఏర్పాట్లు చేస్తే చేసి ఉండొచ్చు. కానీ, ప్రస్తుతం భారీ భద్రత కల్పించారు. దీనికి కారణం మాత్రం ఇటీవల జరిగిన సంఘటనలే’ అని జేమ్స్ చర్చి సభ్యులు ఒకరు చెప్పారు. ‘క్రైస్తవులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ విధంగా బలగాలను విస్తరించి ఉండొచ్చు’ అని మోహిత్ హిట్టర్ అన్నారు.

ఈస్టర్ ప్రాముఖ్యత

ఈస్టర్ ప్రాముఖ్యతను రెవ.మోహిత్ హిట్టర్ వివరించారు. ‘ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజే ఈస్టర్. మేము దీనిని పునరుజ్జీవం అని పిలుస్తాం. చనిపోయిన ప్రతి ఒక్కరూ ఒక రోజున తిరిగి పునరుజ్జీవం చెందుతారనేది మా విశ్వాసం’ అని చెప్పారు. ఈస్టర్ ప్రాముఖ్యత గురించి మరికొందరు తమ భాష్యాలను చెప్పారు. ‘ఈ రోజున ఏసుక్రీసు చనిపోయి తిరిగి పునరుజ్జీవం పొందారు. మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కుంగిపోకూడదు. ఆ సవాళ్లను మనం జయించగలమనే సారాంశం కూడా ఇందులో ఉంది’ అని జెన్నీఫర్ రిచర్డ్ తెలిపారు.

మరిన్ని వార్తలు