స్కూళ్లకు రాని వాళ్లెందరు?

24 May, 2015 23:42 IST|Sakshi

- జూలై 4న అధ్యయనంచేయనున్న విద్యా శాఖ
- రాష్ట్ర వ్యాప్తంగా ఓకే రోజున చేయనున్నట్లు వెల్లడి
సాక్షి, ముంబై:
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చేరని పిల్లల సంఖ్య తెలుసుకునేందుకు విద్యా విభాగం జూలై 4న అధ్యయనం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ర్టవ్యాప్తంగా 12 గంటల పాటు ఈ కార్య క్రమం చేపట్టనుంది. జూలై 4న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంట లకు వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు హాజరుకాని, పాఠశాలలో చేరని విద్యార్థుల సంఖ్యను పరీక్షించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల ప్రారంభించిన 30 రోజుల వరకు రాకపోయినా, పేరు నమోదు చేసుకోకపోయినా సదరు విద్యార్థిని అవుట్ ఆఫ్ స్కూల్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.

మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా, తాలూకా, గ్రామాల స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగుల బృందాలతో ఈ అధ్యయనం నిర్వహిస్తారు. ఇందుకోసం స్థానిక ఎన్జీవోల సహాయం కూడా తీసుకోనున్నారు. ఈ అధ్యయనం కోసం సోషల్ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రకటనలు, తారల ద్వారా పబ్లిసిటీ తదితర కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అధ్యయనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులకు నిర్బంధ విద ్య తప్పనిసరి. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ఈ అధ్యయనాన్ని విధానాన్ని పలు సామాజిక సంఘాలు కూడా ఆహ్వానించాయి. అయితే ఒక్క రోజులో అధ్యయనం పూర్తి చేయడం సాధ్యం కాదని, ఇందుకు సంబంధించి సరయిన వనరులు లేవని ముంబై చైల్డ్ రైట్స్ సమన్వయ కర్త నితిన్ వద్వాని తెలిపారు.
 
12 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై: నగరంలోని 12 పాఠశాలలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన సూచనలను పాటించని పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలు విద్యా హక్కు చట్టం-2009 కింద విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వు చేయాలన్న నిబంధనలను పాటించడం లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు