లక్షల గుడ్లు పంచేశారు!

13 Oct, 2017 23:31 IST|Sakshi

సాక్షి, థానే : 'వరల్డ్‌ ఎగ్‌ డే'ను పురస్కరించుకుని ముంబై, థానేలలో విద్యార్థులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. థానేతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల గుడ్లను పిల్లలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా అధికార యంత్రాంగం ఉడికించిన గుడ్లను అంగన్‌వాడీలు, బాల్‌వాడీలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలలో పంచారు. అంతేకాక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును తీసుకోవడం ద్వారా మంచి ప్రోటీన్‌ అందుతుందని చెప్పారు.

థానే జిల్లా ముఖ్యఅధికారి వివేక్‌ భిమన్వార్‌ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 1,230 అంగన్‌వాడీలు, బాల్‌వాడీలు, ఫ్రీస్కూల్స్‌ ఉన్నాయని, సుమారు 1.3 లక్షల మంది బాలలు ఈ కేంద్రాల్లో చదువుకుంటున్నారని, వారందరకీ గుడ్లను పంచామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యానిమల్‌ హస్బెండరీ అధికారి డాక్టర్‌ ప్రశాంత్‌ కాంబ్లే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వారంతా రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తింటే సరిపడా పోషకాహారం అందుతుందన్నారు.

>
మరిన్ని వార్తలు