ఎనిమిది కిలోల బంగారం దోపిడీ

8 Feb, 2019 02:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అన్నానగర్‌(చెన్నై): చెన్నైలో రూ.2.75 కోట్ల విలువైన 8 కిలోల బంగారు నగలను పట్టపగలే ముగ్గురు వ్యక్తులు దోచుకెళ్లారు. ముంబాయికి వెళ్లాల్సిన బంగారు నగలను కొరియర్‌ బాయ్‌ స్కూటర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళుతుండగా ఈ దోపిడీ జరిగింది. బైకుపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని ఢీకొట్టి కిందపడిన అతనిపై కారంపొడి చల్లి నగల బ్యాగుతో ఉడాయించారు. ఈ ఘటన తమిళనాడులోని కోవై లో గురువారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన మాంగోసింగ్‌ కుమారుడు పృథ్వీసింగ్‌ (26) కోవై మిల్‌రోడ్డుబాక్కం, మరక్కడైలో ప్రైవేటు కొరియర్‌ సర్వీస్‌ సంస్థలో ఉద్యోగి. కోవైలో ఉన్న నగల తయారీ కేంద్రం నుంచి ముంబైకి పంపుతుంటారు. వీటిని ఈ కొరియర్‌ సంస్థ ద్వారానే ఎయిర్‌పోర్ట్‌ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ముంబైకి పంపేందుకు ఇచ్చిన 8 కిలోల బంగారాన్ని పృథ్వీసింగ్‌ గురువారం ఉదయం 5.50 గంటలకు బ్యాగు లో పెట్టుకుని బైక్‌లో విమానాశ్రయానికి బయలుదేరాడు. అవినాశి రోడ్డు, బీలమేట్టులోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కళాశాల సమీపంలో వెళుతుండగా బైకుపై హెల్మెట్‌ ధరించి వచ్చిన ముగ్గురు పృథ్వీసింగ్‌ వెళుతున్న స్కూటర్‌ను ఢీకొన్నారు. అతను కిందపడగానే ముఖంపై కారంపొడి చల్లి, నగల బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.  

మరిన్ని వార్తలు