ఈసీ కొరడా

7 Mar, 2014 01:23 IST|Sakshi
 సాక్షి, చెన్నై: నగరా మోగడంతో ఈసీ కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని తన పరిధిలోకి తీసుకుంది. ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయించడంతోపాటుగా, కోడ్ ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపించే విధంగా ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లాల్లో ఎన్నికల సమీక్షలు గురువారం నుంచి ఆరంభం అయ్యాయి. అభ్యర్థుల ఖర్చులు, తాయిలాల పంపిణీపై డేగ కళ్లతో నిఘా వేయడానికి ప్రత్యేక స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. మదురైలో తొలిరోజే లెక్కలోకి రాని నగదు రూ.కోటి పట్టుబడింది. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలకు ఏప్రిల్ 24న ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగారా మోగించిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం బాధ్యతలను ఎన్నికల కమిషన్ తన పరిధిలోకి తీసుకుంది. ప్రభుత్వం కొత్త పథకాలకు బ్రేక్ వేయడంతోపాటుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయింది. గురువారం నుంచి ఎన్నికల విధులపై రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. 
 
 సమీక్షలు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ఆదేశాలతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం సమీక్షలు ఆరంభం అయ్యాయి. రాజకీయ పక్షాలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, ఎన్నికల అధికారులతో సమావేశాలు జరిగాయి. ఇందులో ఎన్నికల కోడ్, అనుసరించాల్సిన విధానాలు, రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సిన నిబంధనలు తదితర అంశాలను వివరించారు. ఓటర్లకు తాయిలాలు, బట్వాడా, నగదు పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం విక్రయాలపై నిఘా పెంచేందుకు చర్యలు చేపట్టారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో శుక్రవారం నుంచి సాగే వ్యాపార లెక్కలపై నిఘా ఉంచనున్నారు. పెద్ద ఎత్తున స్టాక్‌లను ఎవరెవ్వరు కొనగోలు చేయనున్నారో వివరాల సేకరణ, అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో జన సమీకరణలు, ఖర్చులపై పర్యవేక్షణకు ప్రత్యేక స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అధికారుల నేతృత్వంలో ఈ బృందాలు డేగకళ్లతో నిఘా ఉంచనున్నాయి. 
 
 తనిఖీలు ముమ్మరం: నియోజకవర్గాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే రీతిలో భద్రతా చర్యలకు ఆదేశాలు వెలువడ్డాయి. కోడ్ ఉల్లంఘించి ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించే బాధ్యతలను పోలీసులకు అప్పగించారు. నియోజకవర్గాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతతోపాటుగా తనిఖీల ముమ్మరానికి చర్యలు చేపట్టారు. అన్ని జిల్లా, నగర, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. తనిఖీలు వేగవంతం అయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, తాయిలాల పంపిణీ వంటి వ్యవహారాలను తమకు ఫిర్యాదుల రూపంలో తెలియజేయాలని రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాట్లు చేశారు. 18004257012 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు చేయొచ్చని ప్రకటించారు. 
 
 రూ. కోటి పట్టి వేత: కోడ్ అమల్లోకి రావడంతో మదురైలో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమంగళం, వాడి పట్టి, పెరుంగుడి, ఉన్నాచ్చికులం, ఒండియూర్, కప్పలూరుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీల్లో రూ.కోటి లెక్కలోకి రాని నగదు పట్టుబడింది. కప్పలూరు వద్ద కాన్వాయ్ రూపంలో వచ్చిన 12 వాహనాల్లో 40 లక్షల రూపాయలు పట్టుబడగా, ఆ వాహనాలను సీజ్ చేశారు. కళ్లపట్టి వద్ద రూ.ఏడు లక్షలు పట్టుబడింది. తాను వ్యాపార రీత్యా శివకాశికి వెళ్తోన్నట్టు కోయంబత్తూరు చెందిన ఓ పారిశ్రామిక వేత్త అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అందుకు తగ్గ ఆధారాలు సమర్పించక పోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజు తనిఖీల్లో రూ. కోటి నగదు పట్టుబడినట్టు ఆ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రకటించింది. ఈ నగదును జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
 సమస్యాత్మకం: రాష్ట్ర రాజధాని నగరంలో చెన్నైలో 258 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించామని ఎన్నికల అధికారి, కమిషనర్ విక్రమ్ కపూర్ పేర్కొన్నారు. చెన్నైలో 36,36,199 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. వీరిలో పురుషులు 18,13076 మంది, స్త్రీలు 18 లక్షల 22 వేల 461 మంది, ఇతరులు 662 మంది ఉన్నారని తెలిపారు. మహానగరంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఇక్కడ 3,338 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఇందులో 258 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఉత్తర చెన్నైలో 45, దక్షిణ చెన్నైలో 82, సెంట్రల్ చెన్నైలో 122 ఉన్నాయని వివరించారు. రిప్పన్ బిల్డింగ్‌లో చెన్నై ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రశాంత పూరిత వాతావరణంలో దిగ్విజయవంతం చేయడానికి అధికారులతో సమీక్షించామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
మరిన్ని వార్తలు