డీఎఫ్ ఢమాల్!

16 May, 2014 22:22 IST|Sakshi

సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి ఓటరు చావుదెబ్బ కొట్టాడు. ఈ దెబ్బతో కాంగ్రెస్ దాదాపు  కోమాలోకి వెళ్లిపోగా ఎన్సీపీ తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరిందని చెప్పుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకుగాను 25 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్, ఎన్సీపీలు ఈసారి కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరలేకపోయాయి. ఈసారి ఓటరు హస్తానికి మొండిచేయి చూపగా రాష్ట్రవాది కాంగ్రెస్‌ను కాస్త కనిక రించాడు. రెండు పార్టీలు కలిసి కేవలం 5 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోగా మిగతా అన్ని స్థానాల్లోనూ మహాకూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. గతంలో 17 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకేఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 పరాజయం పాలైన దిగ్గజాలు...: మహారాష్ట్రలోని అనేక మంది దిగ్గజ నాయకులు పరాజయం పాలయ్యారు. ఊహించనిరీతిలో ఓటమిపాలైనవారిలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సహాయక మంత్రులు ఉండడం విశేషం. షోలాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే బీజేపీకి చెందిన శరద్ బన్సోడే చేతిలో ఘోరపరాజయాన్ని రుచిచూశారు. ఇక కేంద్ర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ బండారా-గోండియా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి నానాబహూ పటోలే చేతిలో పరాజయంపాలయ్యారు. మరోవైపు నాసిక్‌లో ఎన్సీపీ సీనియర్ నాయకులైన ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై మహాకూటమి అభ్యర్థి హేమంత్ గోడ్సే గెలుపొందారు.

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి సునీల్ తట్కరేతోపాటు ముకుల్ వాస్నిక్ కూడా ప్రత్యర్థుల చేతిలో పరాజయంపాలవక తప్పలేదు. ముంబైలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అయిదుగురు దిగ్గజాలు మిలింద్ దేవరా, ప్రియాదత్, గురుదాస్ కామాత్, సంజయ్ నిరుపమ్, ఏక్‌నాథ్ గైక్వాడ్‌లు కూడా ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన వారే కాకుండా ఎమ్మెన్నెస్, ఆప్ నాయకులు పరాజయం పాలైనవారిలో ఉన్నారు.

 కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: మిలింద్
 కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయంపాలైన విషయాన్ని ఆ పార్టీ నేత మిలింద్ దేవరావద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన మాట్లాడుతూ... ‘బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి నా శుభాకాంక్షలు. ఓటమిపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బలోపేతమవ్వాలి. మద్దతుదారులకు నా ధన్యవాదాలు. విజేత మోడీకి నా శుభాకాంక్షలు. దేశం ముందుకు పోతుందని అకాంక్షిస్తున్నాన’న్నారు.

మరిన్ని వార్తలు