-

తండ్రీ కొడుకులకు సవాల్

7 Oct, 2014 23:19 IST|Sakshi
తండ్రీ కొడుకులకు సవాల్

సింధుర్గ్ జిల్లాలో ‘రాణే’కు కష్టకాలం?

కంకావ్లి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే, అతని కుమారుడు నితేష్ రాణేలకు సింధుర్గ్ జిల్లా సవాల్‌గా నిలిచింది. కుడాల్ నియోజకవర్గం నుంచి నారాయణ్ రాణే, కంకావ్లి నుంచి నితేష్‌లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాణే పెద్ద కుమారుడు నీలేష్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రత్నగిరి-సింధుర్గ్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక రాణేకు అత్యంత సన్నిహితులైన గణపత్ కదమ్, సుభాస్ బాణే, రాజన్ తేలీ, రవీంద్ర ఫాఠక్‌లు అతడిని వీడి బీజేపీ, శివసేనల్లో చేరడంతో ఈసారి తండ్రీకొడుకులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మాజీ సహాయ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ రాణేతో విభేదాల కారణంగా శివసేనలో చేరి రత్నగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆశలను అనేకసార్లు వెల్లడించిన రాణే కుడాల్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
స్వాభిమాన్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న రాణే చిన్న కుమారుడు నితేష్ రాణే ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అయినప్పటికీ అదే పార్టీ అభ్యర్థిగా కంకావ్లి నుంచి బరిలోకి దిగారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త సణుగుకున్నప్పటికీ బహిరంగంగా ఎవరూ ఆయన నామినేషన్‌ను వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న నారాయణ్ రాణేకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరినైనా వరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

రాణేపై పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన శివసేన అభ్యర్థి వైభవ్ నాయక్ మరోసారి కుడాల్‌లో రంగంలోకి దిగారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో శివసేనకు 22వేల ఓట్ల ఆధిక్యత లభించిందని, అందువల్ల గెలుపు తనదేనని నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ రాణే చేసిందేమీ లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక నితేష్‌పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ జాతర్ పోటీ చేస్తున్నారు. జాతర్ గత ఎన్నికల్లో కేవలం 34 ఓట్లతో గట్టెక్కారు. మాజీ ఎన్సీపీ నాయకుడు సుభాష్ మాయేకర్‌కు శివసేన ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ రెబెల్‌గా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ విజయ్‌సావంత్ నితేష్ ఓట్లకు గండి కొట్టవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు