ఏటీఎంలలో కరెంటు బిల్లు చెల్లించవచ్చు

23 Mar, 2016 08:49 IST|Sakshi

 కేకే.నగర్: ఇకపై ఏటీఎంలలో డబ్బులు తీసుకోవడమే కాదు చెల్లించవచ్చునని అంటున్నారు విద్యుత్ బోర్డు అధికారులు. ఏటీఎంలలో కరెంటు బిల్లు చెల్లించే సేవను ప్రారంభించే దిశగా రాష్ట్ర విద్యుత్ బోర్డు విస్తృత చర్యలు చేపట్టనుంది. సా ధారణంగా ఇళ్లలో మీటర్ రీడింగ్ తీసిన తేదీ నుంచి 20 రోజుల లోపు సొమ్ము చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో కరెంటు కనెక్షన్‌ను కట్ చేయడం విద్యుత్ బోర్డుకు పరిపాటి. జరిమానాతో వారు చార్జీలు చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ తిరిగి ఇస్తున్నారు.

ప్రతినెలా కరెంటు చార్జీల కింద రూ.2,500 కోట్లు వరకు వసూలు చేస్తున్నారు. కరెంటు చార్జీలను చెల్లించే కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వలన వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా చోరీ సంఘటనలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్‌నెట్, పోస్టాఫీసు, ప్రభుత్వ సేవా కేంద్రాల్లో చార్జీలను చెల్లించే సౌకర్యాన్ని విద్యుత్‌బోర్డు ప్రవేశపెట్టింది.

అదే వరుసలో ప్రస్తుతం ఏటీఎం కేంద్రాల్లో కరెంటు చార్జీలు చెల్లించే సేవను పరిచయం చేయడానికి విద్యుత్ బోర్డు నిర్ణయించింది. దీనిపై అధికారి ఒకరు మాట్లాడుతూ ఏటీఎంల ద్వారా కరెంటు చార్జీలను చెల్లించే సేవను ప్రారంభించడంపై ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయోగాత్మక పద్ధతి ద్వారా ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో కరెంటు చార్జీలు చెల్లించే సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలో 15 బ్యాంకుల్లోని ఏటీఎంల ద్వారా ఈ సేవలను విస్తరింప చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు