పెంపునకు బ్రేక్

16 Nov, 2014 02:40 IST|Sakshi
పెంపునకు బ్రేక్

 విద్యుత్ చార్జీలు పెంచే యోచనకు బ్రేక్ పడినట్లు విశ్వసనీయ సమాచారం. కోర్టులో పిటిషన్లు, ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వెనకడుగు వేసింది. శనివారం నుంచి అమలు కావాల్సిన పెంపును నిలిపివేసినట్లు తెలిసింది.
 
 చె న్నై, సాక్షి ప్రతినిధి:విద్యుత్ చార్జీలను పెంచబోతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 23న ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఏ మేరకు పెంచబోతున్నారో అంచనాల పట్టికను సైతం విడుదల చేసింది. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణకు చెన్నై, తిరునెల్వేలీ ఈరోడ్‌లలో రెగ్యులేటరీ కమిషన్ సమావేశాలను నిర్వహించింది. ఉత్తరాలు, ఆన్‌లైన్ ద్వారా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమై తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున విద్యుత్ చార్జీల పెంపుకే మొగ్గుచూపారు.
 
 ఈ నిర్ణయం మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు ఈనెల 15వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణరుుంచుకున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ చార్జీ ల పెంపుపై సీనియర్ న్యాయవాది గాంధీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, విద్యుత్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో విద్యుత్ చార్జీల పెంపును రెగ్యులేటరీ కమిషన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక విద్యుత్ అధికారి  వివరణ ఇస్తూ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వ సలహా మేరకే చార్జీల పెంపును తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయన స్పష్టం చేశారు.
 
 శ్రీరంగం నేపథ్యం
 అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ జైలు శిక్షతో కోల్పోయిన శ్రీరంగం శాసనసభా స్థానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నికలు రానున్నాయి. ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ స్థానంలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక కసరత్తుతో పోటీకి సిద్ధమవుతున్నాయి. కోల్పోయిన స్థానాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే సహజంగానే పట్టుదలతో ఉంది. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను మూటకట్టుకుంటే దాని ప్రభావం శ్రీరంగం ఎన్నికలపై పడగలదని అధికార అన్నాడీఎంకే భయపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే విద్యుత్ చార్జీల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
 
 

మరిన్ని వార్తలు