దూసుకొచ్చిన మృత్యువు

13 Dec, 2015 05:12 IST|Sakshi
దూసుకొచ్చిన మృత్యువు

గోదారిలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి జలసమాధి
మరొకరి గల్లంతు, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
 

 యానాం టౌన్: బంధువుల ఇంటికని కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని మృత్యువు వేటాడింది. మూడు తరాలకు చెందిన ఐదుగురిని కబళించింది. గమ్యం చేరకుండానే గోదావరిలో శవాలై కనిపించారు. యానాం-దరియాలతిప్ప రోడ్డులోని దరియాలతిప్ప వద్దనున్న దర్టీ కంపెనీ సమీపంలో శనివారం ఉదయం గోదావరిలో కనిపించిన ఓ కారులో ఐదుగురి మృతదేహాలున్నారుు. వారిని కాకినాడ తూరంగి ప్రాంతంలోని రాఘవేంద్రపురానికి చెందిన మత్స్యశాఖ విశ్రాంత ఉద్యోగి కొప్పాడ సత్తిరాజు (65), ఆయన భార్య ధనలక్ష్మి (60), కోడలు పార్వతి (30), మనవరాళ్లు హర్షిత (7), రిషిత (5)గా గుర్తించారు. సత్తిరాజు కుమారుడు పవన్ కుమార్(35) గల్లంతైనట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

 బంధువుల ఇంటికని చెప్పి..
 మత్స్యశాఖలో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన కొప్పాడ సత్తిరాజు రాఘవేంద్రపురంలో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు పవన్‌కుమార్ కాకినాడలోని కోరమాండల్ ఫర్జిలైజర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కాట్రేనికోనలో ఉంటున్న సత్తిరాజు చిన్నకుమార్తె వద్దకు వెళ్తున్నామని ఇరుగుపొరుగుకు చెప్పి.. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఏపీ05వీ4201 నంబర్ ఇండికా కారులో ఆరుగురు బయల్దేరారు. పవన్‌కుమార్ పెద్దకుమార్తె స్వీటీ రమణయ్యపేటలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండడంతో వారితో వెళ్లలేదు. కాట్రేనికోన చేరాల్సిన ఆ కుటుంబ సభ్యులు దరియాల తిప్ప దర్టీ కంపెనీ సమీపంలోని గోదావరిలో జలసమాధి అయ్యారు.

మరిన్ని వార్తలు