చిక్కుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు

10 Apr, 2015 02:55 IST|Sakshi

 సాక్షి, చెన్నై: రాజకీయ వేధింపులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వెరసి కింది స్థాయి అధికారులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ముత్తుకుమార స్వామి మరణించారో లేదో, ఉన్నతాధికారుల వేధింపులతో ధర్మపురిలో మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా తిరుచ్చి వైద్యుడు స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో తిరునల్వేలి జిల్లాలో వ్యవసాయ శాఖ ఇంజనీరు ముత్తుకుమార స్వామి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ప్రధాన ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌ను అరెస్టు చేసి ఉన్నారు.
 
  విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీలో  భారీ ఎత్తున అవినీతి తాండవం చేసినట్టు తేలి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 119 పోస్టుల భర్తీకి ఒక్కో పోస్టుకు 1.75 లక్షల చొప్పున ప్రధాన ఇంజనీర్ సెంథిల్ వసూళ్లు చేసి, మొత్తం రెండు కోట్లకు పైగా నగదును అగ్రికృష్ణమూర్తికి ఇచ్చి ఉన్నట్టు విచారనలో వెలుగు చూసి ఉన్నది. అలాగే, కన్యాకుమారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు విచారనలో తేలి ఉన్నది. ఆ ఎమ్మెల్యే ఏకంగా ముత్తుకుమార స్వామిని తన అనుచరుల్ని పంపి బెదిరించి కిడ్నాప్ యత్నం కూడా చేసినట్టు సమాచారం అందడటంతో ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అవుతోన్నది. అలాగే, మరో ముఖ్య నేతను సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు కసరత్తులు జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ధర్మపురిలో ఉన్నతాధికారుల వేదింపులో ఓ కింది స్థాయి ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం మరింత చర్చకు దారి తీసి ఉన్నది.
 
 ఆత్మహత్య : ధర్మపురి జిల్లా కంబై నల్లూరు పట్టణ పంచాయతీ కార్యాలయ అసిస్టెంట్‌గా ఆది(45) పనిచేస్తున్నాడు. గత నెల రోజులుగా ఆయన మరో ఊరికి డిప్యూటేషన్ మీద వెళ్లారు. రెండు రోజుల క్రితం మళ్లీ కంబై నల్లూరులో తన విధుల్ని నిర్వర్తించే పనిలో పడ్డారు.  ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆది తన ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు పట్టణ పంచాయతీ కార్యాలయంలోని ఉన్నతాధికారుల వేదింపులే కారణం అని ఆది తమ్ముడు తంగ వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడ్ని మానసికంగా హింసించారని, డిప్యూటేషన్ల పేరిట ఇతర ఊర్లకు పంపించడంతో పాటుగా వచ్చి రాగే, తమకు కావాల్సిన వారికి అవసరమయ్యే పనులు త్వరితగతిన చేయాలంటూ ఉన్నతాధికారులు, స్థానికంగా ఉండే నాయకులు వేదిస్తూ వచ్చినట్టుగా తంగవేల్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు  ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.
 
 ఒత్తిళ్లతోనే ఆత్మహత్యాయత్నం:
  గత వారం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నెహ్రు రాజకీయ ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఆరు నెలల క్రితం తంజావూరు నుంచి తిరుచ్చి ఆసుపత్రికి బదిలీ అయినట్టు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో ఉన్న తనను ఇక్కడి ఆసుపత్రి వైద్యాధికారిగా పనిచేయాలని స్థానికంగా ఉన్న అధికారులు   ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఆ బాధ్యతలు చేపట్టినా, చివరకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని వివరించారు. అధికార పక్షం నాయకుడు అంటు ఒకరు, మంత్రి అనుచరుడు అంటు మరొకరుడు ఇలా రోజుకు యాభై ఫోన్ కాల్స్ రూపంలో వేదింపులు వచ్చేవి అని పేర్కొన్నారు.
 
  తమ వాళ్లకు చికిత్సలు చేయాలని కొందరు, తమ వాళ్లకు ఆ పనిచేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని వేదించడం మొదలెట్టారన్నారు. ఆరోగ్య శాఖమంత్రి తనతో ఇంత వరకు ఒక్క సారిగా కూడా మాట్లాడ లేదని, ఆయన సహచరులం అని, పీఎ అని పేర్కొంటూ, పలుమార్లు చివాట్లు ఎదురు అయ్యేదన్నారు. ఈ రాజకీయ ఒత్తిళ్లు తాళ లేక సంఘటన జరిగిన రోజు ఆసుపత్రికి వచ్చి సహచర సిబ్బందికి తన ఆవేదనను వెల్లగక్కినట్టు పేర్కొన్నారు. ఆతర్వాత తీవ్ర మనో వే దనకు గురై 30 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానని, అయితే, తనను రక్షించి మళ్లీ రాజకీయ  ఈ వేదింపులు ఎదుర్కొనేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో రాష్ర్టంలో పాలన కుంటు పడిందన్న ఆరోపణలు సాగుతున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్య బాట పట్టడం ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలవరం రేపుతున్నది.  
 

>
మరిన్ని వార్తలు