-

ఉపాధి హామీలో అవినీతికి చెక్

8 Apr, 2016 02:49 IST|Sakshi

-జెడ్పీ సీఈఓ కుర్మారావు

 

రాయచూరు రూరల్  : 2015-16వ సంవత్సరానికి రాయచూరు జిల్లాకు రూ.150 కోట్ల క్రియా పథకానికి ఆమోదం లభించిందని, దీనికి సంబంధించి రూ.100 కోట్లు ఖర్చు అయ్యాయని జిల్లా పంచాయతీ సీఈఓ కుర్మారావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా పంచాయతీ సభాంగణంలో జరిగిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 164 గ్రామ పంచాయతీల్లో అధికంగా చేపట్టిన ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారుల నుంచి పాస్ బుక్, చెక్ బుక్‌లను అందించాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. పంచాయతీల్లో చేపట్టిన అనేక పనులు పూర్తి కాకుండానే బిల్లులు పెట్టి నిధు లను పొందుతున్నారని, దీనిని నివారించేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల వివరాలను పూర్తిగా విశ్లేషించిన తరువాతే నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి షరతులు విధించినా ప్రతీ గ్రామ పంచాయతీల లో పంచాయతీ కార్యద ర్శులు, అభివృద్ధి అధికారులు, అధ్యక్షులు కుమ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారన్నారు.

 

దీనికి సంబంధించి తమకు అనేక ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. పథకం పనులను పూర్తిగా విశ్లేషించేందుకు ప్రతీ 5 గ్రామ పంచాయతీలకు ఒకరు చొప్పున నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, పథకం వివరాలను వారందించిన తరువాతే బిల్లులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ పనుల్లో ఏ విధమైన అవినీతి చోటు చేసుకున్నట్లు వెల్లడైనా సంబంధిత అధికారులపై క్రిమిన ల్ కేసులు పెట్టి వారిపై చట్టరీత్య చర్యలు చేపడతామని హెచ్చరించారు.

 

 

మరిన్ని వార్తలు