ఇక చాలు ఆపండి

24 Aug, 2015 08:22 IST|Sakshi
ఇక చాలు ఆపండి

సాక్షి, చెన్నై :‘ ఆపండి..ఇక చాలు’ అంటూ పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత  ఆదేశాలు ఇచ్చారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వద్దని సూచించారు. ఆ వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలి పెడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జయలలిత భేటీ గురించి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేస్ ఇళంగోవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో పది రోజులకు పైగా రాష్ట్రంలో నిరసనలు సాగుతూ వస్తున్నాయి. అన్నాడీఎంకే వర్గాల ఆగ్రహానికి ఈవీకేఎస్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు సైతం పెరిగాయి.
 
 ఈ పరిస్థితుల్లో జయలలిత సేనల నిరసనలు అన్నాడీఎంకే మీద కొత్త  విమర్శలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. అధికార పక్షం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించడంపై కొన్ని పార్టీలు పెదవి విప్పే పనిలో పడ్డాయి. మరికొన్ని పార్టీలు మౌనం పాటించగా, ఇంకొన్ని పార్టీలు ఈవీకేఎస్‌కు మద్దతుగా నిలిచే పనిలో పడ్డాయి. ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలు ఖండించ దగ్గదైనప్పటికీ , ఆయనకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరిస్తున్న తీరు, నోరు జారుతుండడంపై సర్వత్రా విమర్శించే పనిలో పడ్డారు. ఇంత తంతు సాగుతున్నా, సీఎం జయలలిత వారించడం లేదెందుకు అన్న ప్రశ్న సైతం బయలు దేరింది. దీంతో మేల్కొన్న సీఎం జయలలిత ఇక చాలు, ఆపండి అంటూ నిరసనలకు కల్లెం వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 
 ఆపండి : ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం అవుతుండడంతో పార్టీ వర్గాల్ని వారిస్తూ సీఎం జయలలిత ఆదివారం ప్రత్యేక ప్రకటన చేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన తన  భేటీ గురించి ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ భేటీని అవహేళన చేస్తూ, కించ పరుస్తూ, దిగజారుడు తనంతో అనాగరికంగా వ్యవహరించారని మండి పడ్డారు. పని గట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారో లేదా సంయమనం కోల్పోయే చేశారో ఏమోగానీ ఆ వ్యాఖ్యలు ఖండించ తగినదిగా పేర్కొన్నారు.  తమిళ జాలర్ల విషయంగా ప్రధానికి పదే పదే తాను రాస్తూ వచ్చిన లేఖలను ఎద్దేవా చేస్తూ శ్రీలంక సర్కారు వారి  వెబ్ సైట్‌లో  కించ పరిచే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
 
  ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్‌తో పాటుగా అన్ని పార్టీలు ఖండించాయని, తప్పను సరిదిద్దుకుంటూ శ్రీలంక సర్కారు క్షమాపణ చెప్పుకున్న విషయాన్ని వివరించారు. ఈవీకేఎస్ చేసిన వ్యాఖ్యలను కొందరు వ్యతిరేకిస్తూ,  ఖండించగా, మరికొందరు వెనకేసుకొస్తున్నారని, ఇంకొందరు మౌనం పాటిస్తూ రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని ప్రతి పక్షాలపై  పరోక్షంగా ధ్వజమెత్తారు. తాను చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఈవీకేఎస్ స్పష్టం చేసి ఉన్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే, పరోక్షంగా చేసిన తప్పును ఈవీకేఎస్ సరిదిద్దుకున్నట్టేనని వివరించారు. చేసిన తప్పును సరిద్దుకుంటూ ఈవీకేఎస్ స్పందించిన దృష్ట్యా, ఇక, నిరసనలు కొనసాగించడం మంచి పద్ధతి కాదని పార్టీ వర్గాలకు హితవు పలికారు. ఇక, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు వద్దు అని, ఇక అన్నీ ఆపండి అంటూ ముగించారు.
 
 హర్షం : పార్టీ వర్గాలకు నిరసనలకు కల్లెం వేస్తూ సీఎం జయలలిత స్పందించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసు కృతజ్ఞతలు తెలియజేశారు. వీసీకే నేత తిరుమావళవన్ , సీపీఐ నేత ముత్తరసన్ ఆలస్యంగా స్పందించినా, ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో  ఉదయాన్నే మీడియాతో మాట్లాడిన ఈవీకేఎస్ ఇళంగోవన్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేస్తూ, కేసులకు భయ పడే ప్రసక్తే లేదన్నారు. ఇక, కామరాజర్ ట్రస్ట్ సిబ్బంది వలర్మతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఈవీకేఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఐదురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో తమ అధ్యక్షుడిపై తప్పుడు ఫిర్యాదు చేసిన వలర్మతి భరతం పట్టేందుకు మాజీ ఎమ్మెల్యే యశోధ సిద్ధం అయ్యారు. ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి నిర్ణయించారు.
 
 

మరిన్ని వార్తలు